Share News

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సిద్ధరామయ్య

ABN , Publish Date - Mar 06 , 2026 | 08:15 AM

సీఎం పదవి ఉంటుందా.. ఊడుతుందా.. అనుకున్నారు. అయితే ఆయనకే అద్భుత అవకాశం దక్కింది. రికార్డు స్థాయిలో సీఎం సిద్ధ రామయ్య శుక్రవారం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సిద్ధరామయ్య
Karnataka CM Siddaramaiah

  • గ్రాంట్ల కోసం ఎన్నోశాఖల ఎదురుచూపులు

  • నాయకత్వ మార్పు ఒత్తిడిలోనూ ఆయనకే అవకాశం

బెంగళూరు, మార్చి5 (ఆంధ్రజ్యోతి): సీఎం పదవి ఉంటుందా.. ఊడుతుందా.. అనుకున్నారు. అయితే ఆయనకే అద్భుత అవకాశం దక్కింది. రికార్డు స్థాయిలో సీఎం సిద్ధ రామయ్య (Karnataka CM Siddaramaiah) శుక్రవారం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. అందరి చూపు సిద్దూవైపే అనేలా మరికొన్ని గంటలలోనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. సీఎం సిద్దరామయ్య ఆర్థికమంత్రి హోదాలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు పలు రికార్డులు ఉన్నాయి. అంతకంటే కీలకంగా పలు శాఖల మంత్రులు సైతం మాకు గ్రాంటు పెరిగేనా అనేలా మారిపోయింది. సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర చరిత్రలో మరెవ్వరూ తిరగరాయలేని విధంగా 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అంతకంటే ముఖ్యంగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వారుగాను మరో రికార్డు ఆయన సొంతంగా ఉంది. గత ఏడాది రూ.4.09లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా వచ్చే బడ్జెట్‌ కనీం రూ.40వేల కోట్లు పెరిగే అవకాశం ఉండవచ్చునని చర్చలు సాగుతున్నాయి.


యథావిధిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చేందుకు ప్రధాన కారణమైన ఐదు గ్యారెంటీలకు ఎక్కడా గ్రాంట్లు తగ్గించేది లేదనే వాదన అధికార పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడోఏడాది ముగుస్తున్న తరుణంలో ప్రస్తుతం బీపీఎల్‌ కార్డుదారులకు ఇస్తున్న బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను మార్పు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఇందిరా కిట్‌ల పేరుతో బియ్యంతో సహా పలు రకాల సరుకులు ఇవ్వదలిచారు. ఇక హౌసింగ్‌ పథకం ద్వారా సొంతింటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్న తరుణంలో వారికి సిద్దు అండ ఉంటుందనే చర్చలు సాగుతున్నాయి. విద్య, ఉద్యోగం, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, సహకార, పరిశ్రమలు, రవాణాతో పాటు గ్రేటర్‌ బెంగళూరు విభాగాలకు బడ్జెట్‌లో గ్రాంట్‌లు వరించవచ్చు అనిపిస్తోంది. వీటికి తోడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పాలన సాగిస్తున్న ప్రముఖమైన రాష్ట్రం కావడంతో అన్ని కోణాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలనే రీతిలో బడ్జెట్‌ ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


వైద్యరంగానికి నిధులు పెంచాల్సిందే..

వైద్య ఆరోగ్య రంగం ద్వారా కొత్తపథకాలు తీసుకువచ్చే ఆలోచనలో పాలకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఉండాలనే లక్ష్యం బడ్జెట్‌ ద్వారా సాధ్యం కానుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

సిద్దరామయ్య ప్రధానంగా యువత సాగువైపు తీసుకువచ్చేందుకు సమగ్ర వ్యవసాయ విధానం పద్ధతి ద్వారా ఆశాజనకమైన ప్రాధాన్యత ఉంటుందని రైతుసంఘాలు భావిస్తున్నాయి. రైతులకు సహకార సంఘాల ద్వారా జీరో వడ్డీ రుణశాతాన్ని పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వన్యజీవుల నుంచి మృతిచెందిన రైతులు, వ్యవసాయ కూలీలకు పరిహారం పెంచే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెరుకు రైతుల సమస్యలకు బడ్జెట్‌లో ఒక స్పష్టమైన సందేశం రానున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.


బీసీ వర్గాలకు రిజర్వేషన్‌ గ్రాంట్లు పెరిగేనా..?

రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు బడ్జెట్‌లో కనీసం పదివేల కోట్లు పెరుగవచ్చుననే భావన బీసీ వర్గాల్లో ఉంది. రిజర్వేషన్‌ శాతం 50శాతానికి మించిన మేరకు ఏర్పడే వ్యత్యాసాన్ని బడ్జెట్‌ ద్వారా సమతుల్యం చేసే అవకాశం ఉంది. ఇక పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మరిన్ని విభాగాల నుంచి పెట్టుబడులు సాధ్యం చేసుకోవాలని పాలకుల్లో ఉంది. బడ్జెట్‌ ద్వారా పరిశ్రమలకు మరిన్ని సౌలభ్యాలు సాధ్యం కావచ్చునని పారిశ్రామిక వేత్తలు ఎదురుచూస్తున్నారు. కేవలం బెంగళూరుకే పరిమితమవుతున్న పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపచేయడం కోసం బడ్జెట్‌లో మరింత ప్రోత్సాహం ఉంటుందని పారిశ్రామిక వర్గాలు ఎదురు చూస్తున్నాయి. రవాణా రంగానికి సంబంధించి శక్తి గ్యారెంటీ ద్వారా నాలుగు కార్పొరేషన్‌లు నష్టాల బాటన సాగుతుండటంతో పాటు ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు రాయితీల కోసం ఎదురు చూస్తున్నారు.


సొంత పార్టీ నేతల సహకారమే కీలకం..

ఓ వైపు నాయకత్వ మార్పు అనే రాజకీయ పోరాటంలోనూ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టే బడ్జెట్‌ ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. మేమంతా సమైక్యమని చెబుతున్నా ఎవరికి వారుగా ఎత్తులు వేస్తున్న విషయం తెలిసిందే. మరో మూడునెలల్లో కాంగ్రెస్‌ పాలనకు మూడేళ్లు నిండుతాయి. అందరికీ కేబినెట్‌లో చోటు కల్పించలేమని పలువురు ఎమ్మెల్యేలకు బోర్డులు, కార్పొరేషన్ పదవుల ద్వారా అవకాశమిచ్చారు. తాజాగా వారి పాలన గడువు పెంచారు. అందుకు తగినట్లుగానే గ్రాంట్లు పెరిగితే బాగుంటుందనే ఎదురు చూస్తున్నారు.


230 బస్టాండ్లలో ప్రత్యక్ష ప్రసారం..

రికార్డు స్థాయిలో 17వ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సీఎం సిద్దరామయ్య రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు బడ్జెట్‌ ప్రసంగం చేరువయ్యే దిశగా కొత్త విధానం తీసుకువస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 230 ఆర్డీసీ బస్టాండ్‌లలో స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.


విద్యారంగానికి ప్రాధాన్యం..

కేంద్రంలో యూపీఏ పాలనలో శ్రీకారం చుట్టిన విద్యాహక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేసే దిశగా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఆర్టీఈ చట్టంకు అనుగుణంగా ప్రైవేటు విద్యాసంస్థల్లో 25శాతం సీట్లు పేద పిల్లలకు ఉచితంగా రిజర్వు చేసి సంపూర్ణంగా ఫీజులు చెల్లించేందుకు బడ్జెట్‌లో ప్రస్తావనలు ఉండవచ్చునని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతిథి ఉపాధ్యాయలకు వేతనాల పెంపు, మధ్యాహ్న భోజన సిబ్బంది బడ్జెట్‌వైపు ఎదురు చూస్తున్నారు.


గ్రేటర్‌కు వరాలు దక్కేనా..?

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికేను చారిత్రాత్మకంగా మార్పులు చేసి ఏకంగా గ్రేటర్‌ బెంగళూరు అథారిటీని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఐదు పాలికేలను ఏర్పాటు చేసింది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే బెంగళూరు ప్రజల మనసు దోచేలాంటి అంశాలు బడ్జెట్‌ ద్వారా సాధ్యం కానున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్

ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 08:29 AM