లోక్సభలో కొత్త డీలిమిటేషన్ బిల్లు.. పాక్ ఆక్రమిత ప్రాంతంపై ప్రత్యేక ప్రస్తావన
ABN , Publish Date - Nov 28 , 2026 | 09:10 PM
డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు-2026లో పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంత ప్రస్తావన ఉంది. పాక్ ఆక్రమణ వీడిన వెంటనే అక్కడి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రప్రభుత్వం చేసింది.
ఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు-2026లో (Delimitation Bill 2026) పాకిస్థాన్ (Pakistan) ఆక్రమిత ప్రాంత ప్రస్తావన ఉంది. పాక్ ఆక్రమణ వీడిన వెంటనే అక్కడి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రప్రభుత్వం చేసింది. డీలిమిటేషన్ బాధ్యతను నేరుగా ఎన్నికల కమిషన్ (EC)కి అప్పగిస్తూ బిల్లులోని సెక్షన్ 3(4) ప్రతిపాదనలను చేసింది. పాత బిల్లులను ఉపసంహరించుకుని సోమవారం కొత్త రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026లో కీలక నిబంధనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ చేర్చింది.
పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం విముక్తి పొందిన తర్వాత అక్కడ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టాలని బిల్లులో ప్రతిపాదనలు చేసింది. ఈ బిల్లులోని సెక్షన్ 3(4) ప్రకారం ఈ ప్రాంతంలో ఎన్నికల కమిషనే స్వయంగా డీలిమిటేషన్ కమిషన్ బాధ్యతలు నిర్వర్తించనుంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుండగా.. పాక్ ఆక్రమిత ప్రాంతానికి మాత్రం ఎన్నికల కమిషన్కు నేరుగా కేంద్రం బాధ్యతలు అప్పగించింది. ఈ బిల్లులో 'పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం' అని పేర్కొన్నప్పటికీ, ఎక్కడా 'PoK' అనే పదాన్ని వాడలేదు.
ఈ నిబంధన కేవలం అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం కాగా, లోక్సభ నియోజకవర్గాలు, గతంలో కేటాయించిన 24 సీట్లు లేదా 50% సీట్ల పెంపుపై ఈ బిల్లులో స్పష్టత లేదు. తాజా డీలిమిటేషన్, 50శాతం సీట్ల పెంపు తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేసే 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుగుణంగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి చట్టాల సవరణకు మరో బిల్లు తీసుకురానుంది. గత ఏప్రిల్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో తగిన సంఖ్యాబలం లేక ఆమోదం పొందని విషయం తెలిసిందే. దీంతో పెండింగ్లో ఉన్న బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోనుంది. పెండింగ్ బిల్లులను ఉపసంహరించుకుని సోమవారం కొత్త రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News