మైనర్‌పై సామూహిక హత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు.!
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:08 AM
ఢిల్లీలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను అతికిరాతకంగా హతమార్చి.. మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో పారేశారు. చివరకు ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ జరిగింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలికకు, నిందితుల్లో ఒకరికొకరు పరిచయం ఉంది. ఘటనా సమయంలో ఆమె వారితో కలిసి ఓ టెంపోలో ప్రయాణిస్తున్నారు. ఆ వాహనంలోనే బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత కత్తితో పొడిచి చంపేసి, మృతదేహాన్ని రోడ్డుపై పారేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటనకు ముందు వారంతా టెంపోలోనే మద్యం సేవించారు. ఈ నెల 13న వాయవ్య ఢిల్లీ కుషక్ రోడ్‌లోని స్వరూప్ నగర్ ప్రాంతంలో బాధితురాలి మృతదేహం కుళ్లిపోయి.. కనీసం లింగ నిర్ధారణ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయని, ఒక చేయి వేరుగా పడి ఉన్నట్టు గుర్తించామన్నారు. మరోవైపు.. బాలిక అదృశ్య ఘటనపై ఆమె కుటుంబ సభ్యులెవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఆమె తరచూ ఇంటి నుంచి బయటకు వెళ్లేదని, కొద్ది రోజుల తర్వాత తిరిగి వస్తుండేదని వారు చెప్పారన్నారు.
నిందితులను పట్టుకునేందుకు సుమారు 50కి పైగా సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు. ఈ నెల 15, 16న అర్ధరాత్రి వేళ ముమ్మరంగా గాలించి తొలుత టెంపో డ్రైవర్‌ను పట్టుకున్నారు. తద్వారా ఘటనతో సంబంధమున్న ముగ్గురు మైనర్లు సహా నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై బీఎన్ఎస్, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
వారు స్టార్లే కావచ్చు.. నా దృష్టిలో లా బ్రేకర్లు: తుకారాం ముండే
దారుణం.. 6 నెలల శిశువుపై పిట్ బుల్ దాడి..