వారు స్టార్లే కావచ్చు.. నా దృష్టిలో లా బ్రేకర్లు: తుకారాం ముండే
ABN , Publish Date - Sep 18 , 2026 | 10:09 AM
ఓ పాన్ మసాలా కంపెనీ ప్రకటనలో నటించినందుకు షోకాజ్ నోటీసులు అందుకున్న బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్ స్టార్లు కావచ్చేమోగానీ.. తన దృష్టిలో వారు చట్టాన్ని ఉల్లంఘించిన వారని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే అన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ పాన్ మసాలా కంపెనీ ప్రకటనలో నటించినందుకు షోకాజ్ నోటీసులు అందుకున్న బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్ స్టార్లు కావచ్చేమోగానీ.. తన దృష్టిలో వారు చట్టాన్ని ఉల్లంఘించిన వారేనని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్ తుకారాం ముండే అన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఆ కంపెనీ ఉత్పత్తిని ప్రోత్సహించిన ఆ ముగ్గురు నటుల్లో ఇద్దరు మాత్రమే షోకాజ్ నోటీసులపై స్పందించారని, మరొకరు స్పందించలేదని ఓ వార్తా చానెల్‌కు ఆయన వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించినట్టుగానే వారిని తాను చూస్తానని స్పష్టం చేశారు. అందుకే వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఆ ముగ్గురు నటులు ప్రోత్సహించిన పాన్ మసాలా వాడకం, ప్రోత్సాహంపై మహారాష్ట్రలో నిషేధం ఉందని తెలిపారు.
‘15 రోజుల్లోపు నోటీసులకు స్పందించాలని గడువు ఇచ్చాం. గత నెల 11న వారికి ఆ నోటీసులు పంపాం. ఇప్పటివరకూ ఇద్దరు నటులు మాత్రమే రిప్లై ఇచ్చారు. ఇక, ఒక ప్రాడక్ట్‌ను ప్రోత్సహిస్తే, అది కంపెనీ బాధ్యత అని ఆ నటులు అంటున్నారు. ఆ ఉత్పత్తిని ఎండార్స్ చేస్తే, తమకు బాధ్యత లేదంటున్నారు. అది సరికాదు. ఎఫ్‌డీఏ యాక్ట్ ప్రకారం ఒక కంపెనీ ఉత్పత్తిని ప్రోత్సహించిన వారిపైనా బాధ్యత ఉంటుంది’ అని తుకారం పేర్కొన్నారు.