Share News

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.! రాజ్యాంగం ఏం చెబుతోందంటే?

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:19 PM

సీఈసీపై ప్రతిపక్షం తొలగింపు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నా.. అది అంత ఈజీ కాదు. రాజ్యాంగం కల్పించిన రక్షణతోపాటు, ఉభయ సభల్లోనూ అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించాల్సి ఉంటుంది.

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.! రాజ్యాంగం ఏం చెబుతోందంటే?

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)పై రాజీనామా చేయాలన్న డిమాండ్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే.. సీఈసీని పదవి నుంచి తొలగించడం సాధారణ పార్లమెంటరీ తీర్మానంతో సాధ్యమయ్యే పని కాదు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) స్వతంత్రంగా పనిచేసేందుకు పలు రక్షణలు కల్పించింది భారత రాజ్యాంగం. సీఈసీని ప్రభుత్వం నేరుగా తొలగించడానికి వీల్లేదు. దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం(ఆర్టికల్ 124(4))ను అనుసరించాల్సి ఉంటుందని ఆర్టికల్‌ 324(5) ద్వారా తెలుస్తోంది. సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం-2023లోని సెక్షన్-11(2) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అంటే కేంద్రం గానీ లేదా అధికారంలో ఉన్న పార్టీ గానీ సీఈసీని పదవి నుంచి తొలగించేందుకు వీలు లేదు.


దీని కోసం ముందుగా లోక్‌సభలో కనీసం 100 మంది లేదా రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభ్యంతరం తెలుపుతూ సంతకాలు చేసి తొలగింపు తీర్మానానికి నోటీసులివ్వాలి. లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్‌ దీనిని స్వీకరించాక విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమిస్తారు. ఇందులో సీజేఐ లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ న్యాయ నిపుణుడు ఒకరు ఉంటారు. సంబంధిత ఆరోపణలపై ఈ కమిటీ పూర్తిస్థాయి విచారణ చేపట్టి తమ నివేదికను అందజేస్తుంది. ఆరోపణలు రుజువైనట్లు కమిటీ తేల్చినట్టయితే.. ఈ అంశం ముందుకు వెళ్తుంది. దీనికి ఉభయ సభల్లోని మొత్తం సభ్యుల మెజారిటీ సహా హాజరై ఓటువేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మద్దతు అవసరమవుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తారు.


గతంలో ఏం జరిగింది?

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు సీఈసీ అభిశంసన దాఖలాలు లేవు. అయితే గతంలోనూ ఇదే తరహాలో తొలగింపు డిమాండ్లు, ప్రయత్నాలు మాత్రం చోటుచేసుకున్నాయి. 1992లో నాటి సీఈసీ టీఎన్‌.శేషన్‌పై వామపక్షాలు తొలగింపు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేశాయి. 2006లో అప్పటి ఈసీ నవీన్‌ చావ్లాను తొలగించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది ఎన్‌‌డీఏ. ఇక.. 2009లో సీఈసీ ఎన్‌.గోపాలస్వామి కూడా నవీన్‌ చావ్లా తొలగింపును సిఫారసు చేశారు. అయితే.. నాడు అధికార యూపీఏ ప్రభుత్వం ఆ సిఫార్సును అంగీకరించలేదు.

సంఖ్యా బలమే కీలకం

సీఈసీని తొలగించేందుకు రాజకీయ ఆరోపణలు లేదా సాధారణ మెజారిటీ మాత్రమే సరిపోదు. పార్లమెంట్‌లో అత్యంత కఠినమైన మెజారిటీ అవసరం. అందువల్ల ఏదైనా తొలగింపు తీర్మానం ముందుకు వచ్చినా, అది ఆమోదం పొందేందుకు అవసరమైన సంఖ్యాబలం కీలకంగా మారుతుంది.


ఎందుకీ ప్రక్రియ?

ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో సీఈసీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా పరిశీలించే అవకాశం కూడా రాజ్యాంగం కల్పిస్తోంది. అందువల్ల తొలగింపు నోటీసు అనేది వెంటనే పదవి నుంచి తొలగించే చర్య కాదు. ముందుగా విచారణ, ఆపై ఉభయ సభల్లో కఠినమైన ఓటింగ్‌ ప్రక్రియను దాటాల్సి ఉంటుంది.

అయితే.. ఇక్కడే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలుండగా.. మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు మొత్తం సభ్యుల మెజారిటీ అనే రాజ్యాంగ ప్రమాణం కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. రాజ్యసభలోనూ ఇదే విధమైన ప్రత్యేక మెజారిటీ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో తొలగింపు నోటీసు ఇస్తారా? అనే దానికంటే ఉభయ సభల్లో రాజ్యాంగం నిర్దేశించిన ప్రత్యేక మెజారిటీ సాధ్యమవుతుందా? అన్నదే కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ అధిగమించడం పెద్ద సవాలే.


ఇవీ చదవండి:

తమిళ గ్రంథం తిరుక్కురళ్‌లో ఏముంది?

పాక్‌కు ఉగ్రవాదం అలవాటైంది: విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్

Updated Date - Sep 27 , 2026 | 12:25 PM