Share News

రెండో రోజుకు 'బ్రిక్స్‌'.. ప్రపంచ నేతలకు స్వాగతం పలికిన మోదీ.!

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:39 AM

ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని మరింత బలంగా వినిపించే దిశగా భారత్‌ మరో కీలక అడుగు వేసింది. ఢిల్లీలో భారత్‌ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు రెండో రోజుకు చేరుకుంది.

రెండో రోజుకు 'బ్రిక్స్‌'.. ప్రపంచ నేతలకు స్వాగతం పలికిన మోదీ.!
BRICS Summit 2026

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని మరింత బలంగా వినిపించే దిశగా భారత్‌ మరో కీలక అడుగు వేసింది. ఢిల్లీలో భారత్‌ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు రెండో రోజుకు చేరుకుంది. ఈ సమావేశాలు నేటి(ఆదివారం)తో ముగియనున్నాయి. తుది సమావేశంలో పలువురు ప్రపంచ నేతలు పాల్గొని.. సమ్మిళిత ప్రపంచ వృద్ధి, స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. ‘బలమైన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత నిర్మాణం’ అనే ఇతివృత్తంతో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది భారత్‌. ఈ తుది భేటీకి 'స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం' అనే శీర్షికను నిర్ణయించారు.


నేతలకు ప్రధాని మోదీ స్వాగతం

దేశ రాజధానిలో భారత్‌ మండపం వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం, సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ అల్‌‌సౌద్‌, వియత్నాం పీఎం లే మిన్‌ హంగ్‌, బురుండి అధ్యక్షుడు ఎవారిస్ట్‌ న్దాయిషిమియే, కజకిస్థాన్‌ ప్రెసిడెంట్ కస్సీమ్‌ జోమార్ట్‌ టొకాయేవ్‌, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెసికా అలుపో తదితరులను మోదీ ఆత్మీయంగా ఆహ్వానించారు.


కాగా.. అంతకుముందు శనివారం జరిగిన సమావేశాల్లో పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. చివరకు బ్రిక్స్‌ దేశాలు ఏకాభిప్రాయంతో సంయుక్త ప్రకటనను ఆమోదించాయి. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభంపై సభ్య దేశాల మధ్య ఉన్న విభేదాలను అధిగమించడం సదస్సులో కీలక పరిణామంగా నిలిచింది. అమెరికా ఇరాన్‌పై చేసిన దాడులపై ప్రత్యక్షంగా ప్రస్తావించకుండానే ఢిల్లీ ప్రకటనను రూపొందించడం గమనార్హం. అదే సమయంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు 'చర్చలు, దౌత్యం' ద్వారానే పరిష్కారం కనుగొనాలని బ్రిక్స్‌ నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

రెండో రోజు సమావేశాలతో 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగియనుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీ నుంచి వెలువడే సందేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


ఇవీ చదవండి:

రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్

ఐర్లాండ్ వ్యక్తి ప్రశ్నకు గ్రోక్ అద్భుత సమాధానం.. ఎలాన్ మస్క్ స్పందనిదే..

Updated Date - Sep 13 , 2026 | 11:42 AM