Share News

రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్

ABN , Publish Date - Sep 12 , 2026 | 08:53 PM

కేరళ ఆర్టీసీ బస్సు అదిరిపోయే సౌకర్యాలు అందిస్తోంది. నామమాత్రపు ధరకే లగ్జరీ వసతులు కల్పిస్తూ.. ప్రయాణికులకు విమానం తరహా థ్రిల్‌ను అందిస్తోంది.! నెట్టింట వైరల్ అవుతున్న ఆ బస్సు వివరాలపై ఓ లుక్కేస్తే...

రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్
Kerala Bus Ride Has Wi-Fi, TV, Pantry And Toilet

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణాన్ని తలపించే సౌకర్యాలు.. కానీ టికెట్ ధర మాత్రం రూ.505. కేరళలో నడుస్తున్న ఓ ప్రభుత్వ బస్సు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫ్రీ వై-ఫై, పర్సనల్ టీవీ స్క్రీన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ప్యాంట్రీ, మినీ ఫ్రిజ్‌తో పాటు టాయిలెట్ వంటి సౌకర్యాలూ ఈ బస్సులో ఉండటం ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది.


కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(KSRTC) నిర్వహిస్తున్న ఈ లగ్జరీ వోల్వో ఏసీ బస్సు తిరువనంతపురం-ఎర్నాకుళం మధ్య నడుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ నెల 11న ఈ బస్సుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా 'ఎక్స్‌'లో షేర్ చేయడంతో మరోసారి ఈ సర్వీసుపై ఆసక్తి పెరిగింది. అక్కడ నడుస్తున్న ఈ బస్సులను ఆయన 'బిజినెస్ క్లాస్' సర్వీస్‌గా అభివర్ణించడం విశేషం.


ఇక బస్సు విషయానికొస్తే.. ఇందులో మొత్తం 36 పుష్‌బ్యాక్ సీట్లు ఉన్నాయి. ప్రతి సీటుకు ప్రత్యేకంగా టీవీ స్క్రీన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ సమయంలో హైస్పీడ్ వై-ఫై సౌకర్యం కూడా ఉంది. దూర ప్రయాణాల్లో సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. టాయిలెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్యాంట్రీ, మినీ ఫ్రిజ్ వంటివీ ఉన్నాయి. ప్యాంట్రీలో ప్రయాణికులకు టీ, కాఫీ అందించే సదుపాయం ఉంది. ఈ బస్సు సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. రోజూ ఉదయం తిరువనంతపురం నుంచి బయల్దేరి.. కొల్లం, అలప్పుజ, హైకోర్టు మీదుగా ఎర్నాకుళంకు వెళ్తుంది. ఇందులో ప్రయాణించేందుకు కావాల్సిన టికెట్ ధర రూ.505 మాత్రమే.


ఈ వీడియోను హర్ష్ గోయెంకా షేర్ చేయడంతో కేఎస్ఆర్‌టీసీ అందిస్తున్న ప్రీమియం బస్ సర్వీసుపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తి పెరిగింది. కేవలం రూ.505 చెల్లించి వై-ఫై, టీవీ, ప్యాంట్రీ, టాయిలెట్ వంటి సౌకర్యాలతో ప్రయాణించే అవకాశముండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తక్కువ ఛార్జీకి ఎక్కువ సౌకర్యాలు అందిస్తున్న ఈ బస్సు సర్వీస్.. ప్రజా రవాణాలో కొత్త తరహా ప్రయాణ అనుభూతికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు స్పందిస్తున్నారు.


ఇదే తరహాలో ఆగస్టులో అలప్పుజ-బెంగళూరు మధ్య నడిచే కేఎస్ఆర్‌టీసీ బిజినెస్ క్లాస్ సర్వీస్‌ను హైలైట్ చేస్తూ కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసింది.

Updated Date - Sep 12 , 2026 | 09:44 PM