ఐర్లాండ్ వ్యక్తి ప్రశ్నకు గ్రోక్ అద్భుత సమాధానం.. ఎలాన్ మస్క్ స్పందనిదే..
ABN , Publish Date - Sep 12 , 2026 | 07:04 PM
భారత్‌కు వచ్చి స్థిరపడాలని భావిస్తున్న ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి.. పలు అంశాలపై 'గ్రోక్'ను ప్రశ్నించారు. దీనికి గ్రోక్ ఇచ్చిన సమాధానం, ఈ సరదా సంభాషణపై ఎలాన్ మస్క్ స్పందించిన తీరు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు వచ్చి స్థిరపడాలని భావిస్తున్న ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి.. భారత పౌరసత్వం, ప్రభుత్వ సాయం, ఆస్తుల కొనుగోలు తదితర అంశాలపై ఏఐ చాట్‌బాట్ గ్రోక్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ సరదా సంభాషణపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా రెస్పాండ్ అయ్యారు.
అసలేం జరిగిందంటే?
ఐర్లాండ్ పౌరుడొకరు తన భాగస్వామి, ఇద్దరు పిల్లలతో కలిసి కోల్‌కతాకు వచ్చినట్లు తెలిపాడు. తాను భారత్‌లోనే ఉండిపోవాలని అనుకుంటున్నానని పేర్కొంటూ.. ఇక్కడి పౌరసత్వం పొందేందుకు ఎంతకాలం పడుతుందని ఏఐ చాట్‌బాట్ గ్రోక్‌ను అడిగాడు. దీనికి గ్రోక్ స్పందిస్తూ.. సహజ పౌరసత్వం పొందేందుకు కనీసం 12 ఏళ్ల చట్టబద్ధమైన నివాసం తప్పనిసరని వివరించింది. దరఖాస్తుకు ముందు 14 ఏళ్లలో మొత్తం 11 సంవత్సరాలు భారత్‌లో నివసించాలని చెప్పింది. చివరి ఏడాది కాలంపాటు దేశంలోనే ఉండాలనే నిబంధననూ కూడా పేర్కొంది. అంతేకాకుండా భారత్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని కూడా గ్రోక్ స్పష్టం చేసింది. అంటే.. భారత పౌరసత్వం పొందాలంటే ఐర్లాండ్ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పౌరసత్వం మంజూరు చేయడం ప్రభుత్వ విచక్షణాధికారానికి లోబడి ఉంటుందని తెలిపింది.
మస్క్ ఏమన్నారంటే?
ఈ వీడియోను పీటర్ సెయింట్ ఓంజ్ అనే యూజర్ తన ఖాతాలో పంచుకుంటూ.. 'నవ్వు తెప్పిస్తోంది' అని అభివర్ణించారు. ఈ పోస్టుపై మస్క్ స్పందిస్తూ.. 'ఇండియా ఈజ్ రియలిస్టిక్' అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. భారత పౌరసత్వ నిబంధనల విషయంలో గ్రోక్ ఇచ్చిన సూటి సమాధానంపై పలువురు నెటిజన్లు సరదాగా స్పందించారు. 'భూమిపై మానవ నాగరికత వెలిసిన నాటి నుంచీ భారత్ వాస్తవికంగానే ఉంది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'భారత్ అద్భుతమైన దేశం' అని మరో వ్యక్తి స్పందించారు.
ఇవీ చదవండి:
‘ఆయుర్వేద హుక్కా’.. బాబా రామ్‌దేవ్ వీడియో వైరల్
‘14 నిమిషాలు యాక్టివ్‌గా లేనని తొలగించారు’.. మహిళా ఉద్యోగి ఆవేదన