ఈజిప్టులో రొట్టె కష్టం.. సబ్సిడీ కోతతో సామాన్యుల కష్టాలు
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:36 PM
రొట్టె.. ఈజిప్టు ప్రజల రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన ఆహారం. అలాంటి రొట్టె ధర సబ్సిడీ కోల్పోయిన కుటుంబాలకు ఏకంగా పదిరెట్లు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు 'మాంసం కొనగలమా?' అని ఆలోచించిన ఈజిప్షియన్లు.. ఇప్పుడు కనీసం 'రొట్టె కొనగలమా?' అని లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆహార సబ్సిడీలను తగ్గించే చర్యల్లో భాగంగా వేలాది కుటుంబాలు ప్రభుత్వ రాయితీని కోల్పోతుండటంతో సామాన్యులకు జీవన వ్యయం మరింత భారమవుతోంది. ముఖ్యంగా అక్కడి ప్రజల రోజువారీ ఆహారంలో కీలకమైన ఫ్లాట్ బ్రెడ్ ధరలు 10 రెట్లు పెరిగి.. సబ్సిడీ కోల్పోయినవారికి అందని ద్రాక్షలా మారుతోంది. కైరోలో నలుగురు పిల్లలున్న ఓ కుటుంబానికి జులైలో ఆహార సబ్సిడీ నిలిచిపోయింది. దీంతో ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి.. తమ కుటుంబానికి ఎన్ని రొట్టెలు కావాలో లెక్కలేసుకుంటూ బేకరీ వద్ద క్యూలో నిల్చున్నారు. 'ఇంతకుముందు మాంసం కోసం డబ్బు సరిపోతుందా అని ఆలోచించేవాళ్లం. ఇప్పుడు రొట్టె కోసం ఆలోచించాల్సి వస్తోంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలకు పెట్టి.. తల్లులు తినక..
కాగా.. ఈజిప్టులో జూన్ నుంచి ఇప్పటివరకు సుమారు 8.5 లక్షల మందిని సబ్సిడీ నుంచి తొలగించింది ఆ దేశ సరఫరా మంత్రిత్వ శాఖ. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) మద్దతుతో ఆర్థిక సంస్కరణల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్టు సమాచారం. ప్రస్తుతం.. అక్కడ సుమారు 6.6 కోట్ల మంది సబ్సిడీ రొట్టెపై ఆధారపడుతుండగా.. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 3.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. సబ్సిడీ కోల్పోయిన కుటుంబాల్లో ఖర్చులను తగ్గించుకునేందుకు ఆహారంపైనే కోతలు పడుతున్నాయి. కొందరు తల్లులేమో తాము తక్కువగా తింటూ పిల్లలకు ఆహారం అందించేందుకు యత్నిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో బియ్యాన్ని కూడా కొలిచి వాడాల్సి వస్తోందనే కథనాలూ వినిపిస్తున్నాయి. ఇక.. పండ్లు, మాంసాహారం, స్వీట్లు వంటి వాటికి చాలామంది దూరమవుతుండటం గమనార్హం. యూఎన్ఓ గణాంకాల ప్రకారం.. ఈజిప్టులో గతేడాది సుమారు 90 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతుండగా, జనాభాలో 30 శాతానికి పైగా ఆహార భద్రత ముప్పును ఎదుర్కొంటున్నారు.
అయితే.. సబ్సిడీ కార్డులు కోల్పోయిన వారిలో కొందరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు బదులుగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నావారే. గవర్నమెంట్ స్కూల్స్‌లో రద్దీ, వసతుల కొరత కారణంగానే వారు ప్రైవేట్ విద్యను ఎంచుకుంటున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఆయా కుటుంబాలు సబ్సిడీ కోల్పోయినట్లు తెలుస్తోంది. సబ్సిడీల కోతకు తోడు జీవన వ్యయం పెరుగుతుండటం వారిపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. దీంతో అర్హత కోల్పోయిన కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు యత్నిస్తున్నాయి. కానీ.. దరఖాస్తుల సమర్పణ, కార్యాలయాల చుట్టూ తిరగడం, సమయం వెచ్చించడం వంటి వాటిని భరించడం వారికి కష్టతరమవుతోంది.
రొట్టెకు రాజకీయ ప్రాధాన్యం
ఈజిప్టులో రొట్టె కేవలం ఆహారమే కాదు.. సామాజికంగా, రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం. 1977లో రొట్టె సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2011లో నాటి ప్రభుత్వాన్ని కూల్చిన ఉద్యమంలోనూ 'రొట్టె, స్వేచ్ఛ, సామాజిక న్యాయం' నినాదం కీలకంగా మారింది. అయితే ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 2024లో సబ్సిడీ రొట్టె ధర 4 రెట్లకు ఎగబాకింది. వచ్చే జనవరిలో మరో కీలక మార్పు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంటే ప్రస్తుతమున్న సబ్సిడీ కార్డు విధానాన్ని క్రమంగా నగదు సహాయానికి మార్చాలని భావిస్తోంది. దీంతో భవిష్యత్తులో సామాన్య ప్రజలు ఆహారం కొనుగోలుకే ఇబ్బందులు పడే పరిస్థితి రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి:
'న్యూఢిల్లీ డిక్లరేషన్'కు బ్రిక్స్ కూటమి ఏకగ్రీవ ఆమోదం
బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ