Share News

‘ఆయుర్వేద హుక్కా’.. బాబా రామ్‌దేవ్ వీడియో వైరల్

ABN , Publish Date - Sep 11 , 2026 | 07:39 PM

ఈ-సిగరెట్లు, షిషా, ఫ్లేవర్డ్‌ హుక్కాలు ఈ మధ్య యువతలో ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో.. యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది.

‘ఆయుర్వేద హుక్కా’.. బాబా రామ్‌దేవ్ వీడియో వైరల్
Baba Ramdev Makes Ayurvedic Hookah

ఇంటర్నెట్ డెస్క్: ఈ-సిగరెట్లు, షిషా, ఫ్లేవర్డ్‌ హుక్కాలు ఈ మధ్య యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. ఇందులో ఆయన 'ఆయుర్వేద హుక్కా' లాంటి తయారీని వివరిస్తూ.. కొన్ని శ్వాసకోశ సమస్యలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.


వైరలైన వీడియోలో బాబా రామ్‌దేవ్‌.. సంప్రదాయ హుక్కా తరహాలో ఓ తయారీని చూపించారు. అందులో ములేఠీ(లికోరైస్‌), పసుపు, ఆవాలు, ఆవు నెయ్యి, కాక్రా సింగి, దేశీ కర్పూరం వంటి పదార్థాలను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ముందుగా ములేఠీని కొద్దిగా నూరి.. అందులో ఆవు నెయ్యి, పసుపు, ఆవాలు కలపాలన్నారు. ఆ తర్వాత హుక్కా లాంటి పరికరంలో ఈ మిశ్రమాన్నంతా వేడిచేసి, ఆ పొగను పీల్చే విధానాన్ని చూపారు. ఈ పొగను పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ, దగ్గు వంటి సమస్యల ద్వారా ఉపశమనం లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆయుర్వేదంలో చెప్పే వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యతతోనూ ఆయన ఈ పద్ధతినే అనుసంధానిస్తున్నట్టు తెలుస్తోంది.


అయితే.. ఇవి సంప్రదాయ ఆరోగ్య వాదనలు మాత్రమే కాబట్టి వీటిని వైద్య పరంగా నిరూపితమైన చికిత్సగా పరిగణించేందుకు క్లినికల్‌ ఆధారాలేమీ లేవు. ఏదైనా పదార్థాన్ని కాల్చాక దాని పొగను పీల్చినప్పుడు.. అందులోని సూక్ష్మ కణాలు, దహన ఉత్పత్తులు ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశముంది. వాటిల్లో పొగాకు లేకపోయినప్పటికీ.. ఆ పొగను పీల్చడం వల్ల కలిగే ప్రభావాలను పూర్తి సురక్షితంగా భావించకూడదు. అందువల్ల దగ్గు, ముక్కుదిబ్బడ లేదా ఇతర శ్వాసకోశ సమస్యలకు ఇలాంటి విధానాలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.


ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పలువురు నెటిజన్లు రామ్‌దేవ్‌పై విమర్శలు గుప్పించారు. పొగను పీల్చడం ఆరోగ్యకరం కాదని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం దీనిపై కాస్తంత ఆసక్తి కనబరిచారు. 'ఆయుర్వేదం పేరుతో హుక్కా.. ఇదేం కొత్త ప్రయోగం?' అంటూ పలువురు ప్రశ్నించగా.. పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా 'ఆయుర్వేద హుక్కా' పేరుతో వైరల్‌ అవుతున్న ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో చర్చ జోరందుకుంది.


ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 11 , 2026 | 07:42 PM