Share News

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:37 PM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్ నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ
PM Modi in BRICS

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు(శుక్రవారం) ఢిల్లీలో జరిగిన బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్ నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ జనాభాలో 50 శాతానికి, ప్రపంచ జీడీపీలో 40 శాతానికి, ప్రపంచ వాణిజ్యంలో 25 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు.


గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు పెరిగిందని మోదీ పేర్కొన్నారు. అదే సమయంలో బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి జీడీపీ దాదాపు నాలుగున్నర రెట్లు విస్తరించిందని చెప్పారు. అంటే ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్‌ దేశాల ఆర్థిక బలం దాదాపు రెండింతల వేగంతో పురోగతి సాధించిందని ఆయన తెలిపారు. బ్రిక్స్‌ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజాప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు.. విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలకు బ్రిక్స్‌ దేశాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం.. వాటి భవిష్యత్తు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని కొనియాడారు.


బ్రిక్స్‌ దేశాల్లో పెరుగుతున్న స్థాయి, వేగం, ఆశావాదం స్పష్టంగా కనిపిస్తున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం మరింత విస్తరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్‌ వేదికగా జరుగుతున్న ఈ సమావేశం ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో అతిపెద్ద ఫోరమ్ అన్నారు. వివిధ దేశాల వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఒకే వేదికపైకి రావడం ద్వారా కొత్త అవకాశాలకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సాంకేతిక సహకారం మరింత బలోపేతం కావడానికి ఈ వేదిక సహకరిస్తుందని ఆయన అన్నారు.


ఇవీ చదవండి:

పుతిన్‌కు మోదీ అందించిన విశిష్ట బహుమతి.. 'తిరుక్కురళ్'

ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత.. ఇరు దేశాల మైత్రి బలపడనుందా.?

Updated Date - Sep 11 , 2026 | 07:03 PM