ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత.. ఇరు దేశాల మైత్రి బలపడనుందా.?
ABN , Publish Date - Sep 11 , 2026 | 03:40 PM
2019 గల్వాన్ ఘర్షణల అనంతరం మొదటిసారి భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా అధినేత భారత్‌కు రావడమిదే తొలిసారి. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య మైత్రి బలపడనుందని, వాణిజ్య సంబంధాలు మళ్లీ మెరుగవుతాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మోదీ, జిన్‌పింగ్ చర్చ పలు కీలక అంశాలపై జరగనుంది. ముఖ్యంగా భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలకు ముగింపు చెప్పాలని మోదీ సూచించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. శాంతియుత వాతావరణం ఏర్పాటు దిశగా చర్చ సాగుతుందని విశ్లేషిస్తున్నారు. నిరుడు రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులోనే మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య సరిహద్దు వివాదం విషయంలో ఓ కీలక ఒప్పందం జరిగింది. అందులో భాగంగా అక్కడి సమస్యలు పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో చర్చించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
వాణిజ్యంపైనే ప్రత్యేక దృష్టి
కాగా.. భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. రెండు దేశాల మధ్య జరిగే వాణిజ్యంలో అసమానతలు ఉన్నాయని భారత్ భావిస్తోంది. చైనా నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటున్న భారత్.. ఎగుమతుల విషయంలో మాత్రం వెనుకబడింది. దీంతో ఈ వాణిజ్య అసమానతలను మోదీ చర్చలో ప్రస్తావించే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివర్లో ఇరు దేశాల మధ్య రికార్డు స్థాయిలో 151 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. అదే సమయంలో భారత్‌లో వాణిజ్య లోటు(వాణిజ్యంలో ఎగుమతుల కన్నా దిగుమతుల సంఖ్య ఎక్కువగా ఉండడం) కూడా రికార్డు స్థాయిలోనే నమోదైంది. గణాంకాల ప్రకారం ఇది 112 బిలియన్ డాలర్ల వరకు ఉంది. అందుకే వాణిజ్య లోటుపై ప్రధాన చర్చ నడుస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మారుతున్న పరిస్థితులు
ఇటీవలి కాలంలో భారత్-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏడాది క్రితమే ఇరు దేశాలకు విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే చైనా వ్యాపారుల కోసం వీసా ప్రక్రియను భారత్ సులభతరం చేసింది. సుమారు ఆరేళ్ల తరువాత రెండు దేశాల మధ్య సరిహద్దు ట్రేడింగ్ కూడా ప్రారంభమైంది. ఇలా కొంత కాలంగా పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దీనికి ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రిక్స్ సదస్సు.. పుతిన్, షీ జిన్‌పింగ్ సహా పలువురు ప్రముఖులు బస చేసే హోటళ్లు ఇవే!
బ్రిక్స్ సమ్మిట్: చిదంబరంనకు సొంత పార్టీ నేతల నుంచే కౌంటర్