Share News

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:57 PM

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం రూ.620 కోట్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది.

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
RWS Contractors Pending Bills

అమరావతి: ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం రూ.620 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వెలుపల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. మరోవైపు, చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది.


అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. జల్‌ జీవన్‌ మిషన్‌ కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో 31 మార్చి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌ 18న కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో పెండింగ్‌ పేమెంట్లను త్వరగా క్లియర్‌ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ హామీ ఇచ్చారని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు నిరంతరం కృషి చేసి బిల్లుల చెల్లింపులు చేపట్టారని చెప్పారు.


రెట్రోఫిట్టింగ్‌ పనులకు సంబంధించి నవంబర్‌ 2024 నుంచి 31 మార్చి 2026 వరకు రూ.647 కోట్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించినట్లు శ్రీనివాస్ తెలిపారు. మార్చి 31 వరకు ఉన్న రెట్రోఫిట్టింగ్‌ బిల్లులన్నింటినీ చెల్లించడంతో కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ఊరట లభించిందన్నారు. ఇక, స్పర్శ పథకం కింద సుమారు రూ.138 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటివరకు సుమారు రూ.70 కోట్ల మేర చెల్లింపులు జరిగాయని తెలిపారు. మిగిలిన మొత్తాన్నీ వీలైనంత త్వరగా క్లియర్‌ చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.


మరోవైపు, పెండింగ్‌ బిల్లుల చెల్లింపులతో ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు ఉపశమనం లభించిందని నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. కాంట్రాక్టర్లతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబాలకూ ప్రభుత్వం అండగా నిలిచిందంటూ కృతజ్ఞతలు తెలిపింది. ఇకపై కాంట్రాక్టర్లకు నెలనెలా నిర్దిష్ట విధానంలో పేమెంట్లు చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు ఫస్ట్: సీఎం చంద్రబాబు

లోకేశ్ సవాల్‌కు నేటికి స్పందించని జగన్: ఎంపీ కేశినేని చిన్ని

Updated Date - Sep 11 , 2026 | 03:09 PM