Share News

కుల్దీప్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీ చరణి!

ABN , Publish Date - Sep 11 , 2026 | 02:44 PM

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం శ్రీ చరణి చరిత్ర సృష్టించింది.

కుల్దీప్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీ చరణి!
Shree Charani

స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం శ్రీ చరణి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరిట ఉన్న రికార్డ్‌ను శ్రీ చరణి అధిగమించింది.


తొలి సెమీ ఫైనల్‪లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ఈ కడప బిడ్డ 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్(జువైరియా ఫెర్దౌస్) తీసింది. ఇది శ్రీ చరణికి 50వ వికెట్ కాగా.. 29 మ్యాచ్‌ల్లోనే ఆమె ఈ మైలురాయిని అందుకుంది. తద్వారా కుల్దీప్ యాదవ్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. 2023లో కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్‌ల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. దీంతో భారత పురుష, మహిళా క్రికెటర్లలో కలిపి అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా శ్రీ చరణి అరుదైన ఘనతను సాధించింది.


వరుణ్ చక్రవర్తి(32 మ్యాచ్‌లు), అర్ష్‌దీప్ సింగ్(33 మ్యాచ్‌లు), రాధా యాదవ్(35 మ్యాచ్‌లు) అత్యంత వేగంగా 50 వికెట్ల ఘనతను అందుకున్న జాబితాలో కొనసాగుతున్నారు. అయితే ఓవరాల్ గా మహిళా క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా శ్రీ చరణి నిలిచింది. చైనాకు చెందిన మెంగ్టింగ్ లియు 28 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. శ్రీ చరణి, లీ కాస్పరెక్, అనీసా మహమ్మద్ 29 మ్యాచ్‌ల్లో ఈ ఘనతను అందుకొని రెండో స్థానంలో కొనసాగుతున్నారు.


బంగ్లాతో మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడంతో శ్రీ చరణి ఖాతాలో మరో రికార్డు కూడా నమోదైంది. 50 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో భారత పిన్న వయస్కురాలిగా కూడా శ్రీ చరణి నిలిచింది. 22 ఏళ్ల 37 రోజుల వయసులో శ్రీచరణి ఈ ఘనతను అందుకుంది. రాధా యాదవ్ 20 ఏళ్ల 340 రోజుల వయసులో ఈ ఘనతను అందుకొని తొలిస్థానంలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం: ఏపీ టీడీపీ చీఫ్

పుతిన్, జిన్‌పింగ్, పెజెష్కియాన్‌లతో.. బ్రిక్స్‌ సదస్సు వేళ ప్రధాని మోదీ కీలక భేటీలు..

Updated Date - Sep 11 , 2026 | 02:57 PM