Share News

ఇది టెస్టు క్రికెట్‌కే అవమానం.. ఆయూబ్‌ను ఆడించడంపై నాజర్ హుస్సేన్ ఫైర్

ABN , Publish Date - Sep 11 , 2026 | 01:41 PM

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయంపై మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డాడు. మూడో టెస్టుకు సైమ్ అయూబ్‌ను జట్టులోకి తీసుకురావడాన్ని తప్పుబట్టాడు.

ఇది టెస్టు క్రికెట్‌కే అవమానం.. ఆయూబ్‌ను ఆడించడంపై నాజర్ హుస్సేన్ ఫైర్
Nasser Hussain

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఓ నిర్ణయంపై మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తీవ్రంగా మండిపడ్డాడు. మూడో టెస్టుకు సైమ్ అయూబ్‌ను జట్టులోకి తీసుకురావడాన్ని తప్పుబట్టాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా టీ20 క్రికెట్ ఆడి నేరుగా ఇంగ్లండ్ పరిస్థితుల్లో టెస్టు ఆడేలా చేయడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశాడు. మూడో టెస్టులో ఆయూబ్ ఘోర ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. రెండుసార్లు ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం గమనార్హం. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉదాహరణను కూడా ప్రస్తావిస్తూ నాజర్ హుస్సేన్ పాక్ బోర్డుపై ఫైరయ్యాడు.


‘నిజం చెప్పాలంటే సైమ్ అయూబ్ ఇక్కడ ఉండకూడదు. అతడు కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) నుంచి నేరుగా వచ్చాడు. కొంతకాలంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కూడా ఆడలేదు. పూర్తిగా భిన్నమైన ఫార్మాట్ ఆడి, విదేశీ పరిస్థితుల నుంచి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి.. డ్యూక్స్ బంతిని, ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొని బాగానే ఆడతాడని ఎవరు భావించారో నాకు అర్థం కావడం లేదు. ఇష్టమొచ్చినట్లు ప్లేయర్లపై వేటు వేయడం, కోచింగ్ సిబ్బందిని మార్చడం మంచి పద్ధతి కాదు. ఇది టెస్టు క్రికెట్‌కు ఒక రకంగా అవమానమే. ఎవరిని అడిగినా టెస్టు క్రికెట్‌నే అత్యంత కఠినమైన ఫార్మాట్ అంటారు. ఇంగ్లండ్‌లో టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం మరింత కష్టం. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోని ఏదో మూల నుంచి ఒక ఆటగాడిని విమానం ఎక్కించి తీసుకొచ్చి.. ‘ఆల్ ది బెస్ట్’ అని పంపించడం ఎలా సరైన నిర్ణయం అవుతుంది?’ అని నాజర్ ప్రశ్నించాడు.


సెహ్వాగ్‌కు కూడా ఇదే అనుభవం

తన వాదనకు బలం చేకూర్చేందుకు హుస్సేన్ భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉదాహరణను ఇచ్చాడు. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా ఇంగ్లండ్‌కు తీసుకొచ్చిన సెహ్వాగ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడని గుర్తుచేశాడు. ‘వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే మైదానంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతడిని కూడా నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. సెహ్వాగ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. అది కూడా సెహ్వాగ్ లాంటి గొప్ప, అనుభవజ్ఞుడైన ఆటగాడు. సైమ్ ఆయూబ్.. సెహ్వాగ్ కంటే గొప్ప ప్లేయరా? అతడు ఆడిన షాట్‌కు కొంత బాధ్యత అతడిపైనా ఉంటుంది. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్న వ్యక్తులు కూడా బాధ్యత వహించాలి. ఈ వారం అతడు ఇక్కడికి వచ్చి బాగా ఆడతాడని నిజంగా ఎలా అనుకున్నారు?’ అంటూ పాకిస్థాన్ సెలక్షన్ విధానంపై నాజర్ హుస్సేన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.


ఇవి కూడా చదవండి:

రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్

సచిన్ రికార్డుపై జో రూట్ కన్ను.. వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Sep 11 , 2026 | 01:43 PM