Share News

ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో పోటాపోటీగా ర్యాలీలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:48 AM

ఢిల్లీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఓటర్ల సవరణ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఇండియా కూటమి, 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీలు చేపట్టునున్నాయి.

ఇండియా కూటమి వర్సెస్ బీజేపీ.. ఢిల్లీలో పోటాపోటీగా ర్యాలీలు

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించనున్నాయి. ఓటర్ల సవరణ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఇండియా కూటమి, 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీలు చేపట్టనున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో అక్రమాలు జరిగాయని, అందుకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి ఎంపీలు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ వద్ద సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు సెంట్రల్‌ ఢిల్లీలోని మింటో రోడ్‌ కనౌట్‌ ప్లేస్‌ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తేజస్వీ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొననున్నారు. ఇండియా కూటమి చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ర్యాలీ రామ్‌లీలా మైదానంలో ముగియనుంది.


ఢిల్లీ కట్టుదిట్టం

అధికార, ప్రతిపక్ష కూటమి నేతల ర్యాలీల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, సీఆర్‌పీఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సహా 10 వేల మంది సిబ్బందిని మోహరించారు. రామ్‌ లీలా మైదానం, మింటో బ్రిడ్జి నుంచి ర్యాలీ మార్గంలో 4 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని నియమించారు. కనౌట్‌ ప్లేస్‌, జంతర్‌ మంతర్‌, భగవాన్‌ దాస్‌ రోడ్‌, సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కార్యాలయ పరిసరాల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెంట్రల్‌ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దారి మళ్లించారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.


1984 సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా బీజేపీ

మరోవైపు బీజేపీ కూడా పశ్చిమ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించనుంది. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా ర్యాలీ చేపడుతున్నామని పార్టీ తెలిపింది. సిక్కుల ఊచకోత జరిగిన రోజే కాంగ్రెస్‌ తన ర్యాలీ నిర్వహిస్తోందని బీజేపీ విమర్శించింది. బీజేపీ ర్యాలీ ఉదయం 11.30 గంటలకు హరినగర్‌ బస్‌ డిపో నుంచి ప్రారంభమై తిలక్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు కొనసాగనుంది. కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, సహాయ మంత్రి హర్ష్‌ మల్హోత్రా, హెచ్‌ఎస్‌ ఫూల్కా, మన్‌జీందర్‌ సింగ్‌ సిర్సా, బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్‌ తదితరులు ర్యాలీలో పాల్గొననున్నారు. అలాగే1984 అల్లర్లలో బాధిత కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు కూడా ర్యాలీలో పాల్గొననున్నారు.


ఇలాంటి టైమ్‌‌లో ర్యాలీలా.. వ్యాపారుల ఆందోళన

ర్యాలీల వల్ల తమ వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఢిల్లీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో వ్యాపారం బాగా సాగుతోందని, అలాంటి సమయంలో రోడ్ల మూసివేత, ట్రాఫిక్‌ రద్దీ వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఆటోమొబైల్‌ పార్ట్స్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వినయ్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును తాము గౌరవిస్తామని, అయితే ర్యాలీకి ఎంచుకున్న సమయం, ప్రదేశం సరైనవి కావన్నారు. పండుగ సమయంలో ర్యాలీల వల్ల వ్యాపారులు ఇబ్బందులు పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 12:02 PM