ఒమర్ అబ్దుల్లాపై తిరుగుబాటు?
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:18 AM
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గాన్ని విస్తరించిన కొద్ది రోజుల తర్వాతనే పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
కశ్మీర్లో మంత్రివర్గ విస్తరణపై సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి
24 మంది ఎమ్మేల్యేల సుదీర్ఘ భేటీ
సీఎం సలహాదారుడితో పాటు పలువురు మంత్రులను తొలగించాలని డిమాండ్
శ్రీనగర్, అక్టోబరు 31: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గాన్ని విస్తరించిన కొద్ది రోజుల తర్వాతనే పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒమర్ అబ్దుల్లా ఇటీవల నలుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే పలువురు సీనియర్ శాసనసభ్యులకు క్యాబినెట్లో చోటు దక్కలేదు. దీనిపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు, పార్టీ నాయకత్వానికి ఒక అల్టిమేటమ్‌తో పాటు పలు డిమాండ్లతో కూడిన జాబితాను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో సీఎం సలహాదారుడు నజీర్ అస్లాంతో పాటు డిప్యూటీ సీఎం సుదీందర్ చౌధరి, పలువురు ఇతర మంత్రులతో రాజీనామా చేయించాలనేది ప్రధాన డిమాండ్‌గా ఉందని తెలిపాయి. మంత్రుల వంటి కీలకమైన నియామకాల విషయంలో సంప్రదింపులు లేకపోవడాన్ని అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రధానమైన పార్టీ నిర్ణయాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను నాయకత్వం పక్కనపెడుతోందని ఆరోపిస్తున్నారు.
మరింత సంప్రదింపులు చేయాలి
శ్రీనగర్‌కు చెందిన పార్టీ ఎంపీ అగా రుహుల్లా మెహదీ నవంబరు 3న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. శుక్రవారం జరిగిన సమావేశానికి అధికార పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై, తిరుగుబాటు గ్రూపునకు తమ మద్దతు ప్రకటించినట్లు సమాచారం. కశ్మీర్ లోయతో పాటు జమ్మూ రీజియన్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండేళ్ల పదవి పూర్తి చేసుకున్న మంత్రులను తొలగించడం లాంటివి ఇతర డిమాండ్లలో ఉన్నాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ మంత్రుల మధ్య కూడా అసంతృప్తికి దారితీసిందని చెబుతున్నారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని, అయితే ఇకపై పాత పద్ధతులు కొనసాగకూడదని అన్నారు. సీఎం తమ మాట విని.. పార్టీ, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా మార్పులు చేయాలని అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఒకరు కోరారు. కాగా, 90 మంది సభ్యులు గల జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 41 మంది శాసనసభ్యలు ఉన్నారు. మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, పలు ఇతర పార్టీల మద్దతుతో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
జర్నలిస్టును పెళ్లాడిన ఒమర్
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(56) జర్నలిస్టు నిధి రజ్దాన్(49)ను వివాహం చేసుకున్నారు. తామిద్దరం శుక్రవారం వివాహం చేసుకున్నామని ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా శనివారం ప్రకటించారు. శ్రీనగర్‌లో జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఒమర్ అబ్దుల్లాకు ఇది రెండో వివాహం. ఒమర్ అబ్దుల్లాకు పాయల్ అనే మహిళతో 1994లో వివాహమవ్వగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తాను తన భార్య నుంచి విడిపోతున్నట్టు ఒమర్ అబ్దుల్లా 2011లో ప్రకటించారు. నాటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివాదం ఏళ్లుగా న్యాయస్థానంలో ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లాకు పాయల్ అబ్దుల్లాతో విడాకులు మంజూరు చేస్తామని సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలోనే ప్రకటించింది. ఆ తర్వాత 3నెలలకే ఒమర్ మరో వివాహం చేసుకున్నారు.