స్విమ్మింగ్ పూల్‌లో విద్యుత్ ప్రసారం
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:43 AM
బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో శుక్రవారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
బెంగళూరులోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు విదేశీయుల మృతి
బెంగళూరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో శుక్రవారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ ప్రసారం కావడంతో ఈత కొడుతున్న ఇద్దరు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. హలసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. మృతులను స్లోవాకియా రిపబ్లిక్‌కు చెందిన మహిళ జురాజ్ హోవర్ట్(45), జర్మనీకి చెందిన అలెగ్జాండర్ మాక్సిమిలిన్(57)గా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన మాథ్యూడిసాంటిస్, రాహుల్ త్రిపాఠి గాయపడ్డారు. అలెగ్జాండర్ భార్య ఫిర్యాదు మేరకు హలసూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాన్రాడ్ హోటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌లో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగిందని డీసీపీ విక్రమ్ ఆమ్టే తెలిపారు. మృతులు కొన్నిరోజులుగా ఆ హోటల్‌లో బస చేస్తున్నారని చెప్పారు. స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నించిన స్విమ్మింగ్‌పూల్ నిర్వాహకుడు, లైఫ్ గార్డ్ రాహుల్ త్రిపాఠి, హోటల్‌కు వచ్చిన మాథ్యూ గాయపడ్డారని పేర్కొన్నారు.