ఓటర్ల ప్రధాన సమస్యలేంటో నాకు తెలియదు: ట్రంప్
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:01 PM
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటర్ల సమస్యలపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తడబడుతూ తెలియదనే సమాధానమివ్వడం ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్.. తనకు ఓటర్ల ప్రధాన సమస్య ఏమిటనే విషయమై తనకు స్పష్టత లేదన్నారు. వైట్‌హౌస్ వెలుపల ఇటీవల విలేకరులు ఈ ప్రశ్న అడగ్గా.. 'నాకు కచ్చితంగా తెలియదు' అంటూ సమాధానమివ్వడంలో తడబడ్డారు. కానీ తన హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం పటిష్ఠంగా ఉందంటూ ప్రభుత్వ విజయాలను వివరించారు. అమెరికాలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. దేశంలో పేదరికం అత్యల్ప స్థాయికి చేరిందని, ఆయా వర్గాల ప్రజలు ఆదాయాలు గణనీయంగా పెరిగాయని చెప్పుకొచ్చారు.
అయితే.. అక్కడ నిర్వహించిన తాజా సర్వేలు మాత్రం ఓటర్ల ఆందోళనకు భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం తమ ఓటును ప్రభావితం చేసే ప్రధాన అంశాలని పలువురు అమెరికన్లు చెబుతున్నారు. యూఎస్‌లో ద్రవ్యోల్బణం, ధరలే అత్యంత ప్రధాన సమస్య అని 37 శాతం మంది తెలిపినట్టు ఓ సర్వే పేర్కొంది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని 47 శాతం మంది అభిప్రాయపడినట్టు వెల్లడించింది. కాగా.. అమెరికాలో గ్యాసోలిన్, డీజిల్ ధరలు పెరగడం కూడా రిపబ్లికన్లకు రాజకీయంగా ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ గ్యాసోలిన్ పన్నును తాత్కాలికంగా నిలిపివేసే అంశంపై దృష్టి సారిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు.
నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్(అమెరికన్ పార్లమెంట్)పై పట్టు నిలబెట్టుకోవాలంటే రిపబ్లికన్లకు ఆర్థిక అంశాలు అత్యంత కీలకం కానున్నాయి. ఉద్యోగాలు, పెట్టుబడులపై ట్రంప్ చెబుతున్న విజయగాథకు.. ధరల భారంపై ఓటర్ల అసంతృప్తికి మధ్య ఉన్న వ్యత్యాసమే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది.
ఇవీ చదవండి:
భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
సౌదీలో పాక్, తుర్కియే బలగాలు హుతీల దాడులతో ‘మక్కా డీల్’ అమల్లోకి