Share News

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:05 AM

అమెరికా మీడియాలో ప్రచురితమైన ఓ కథనంపై ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా ఖండించింది.

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్
Israel Rejects US Report

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశానికి చెందిన కీలక నేతలను హతమార్చేందుకు ఇజ్రాయెల్ కుట్రపన్నిందంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ కథనాన్ని తీవ్రంగా ఖండించింది ఇజ్రాయెల్. ఆ వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని, వాస్తవాలకు విరుద్ధంగా రాసిన ఫేక్ న్యూస్ అని తోసిపుచ్చింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.


ఆ కథనంలో ఏముందంటే.?

అమెరికా మీడియా కథనం ప్రకారం.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఎంబీ.గాలిబాఫ్‌లు ఆ దేశం తరఫున కాల్పుల విరమణ, శాంతి చర్చల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపింది. వీరిరువురి లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగే అవకాశముందని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు యూఎస్ అధికారులు.. ఇతర దేశాల ద్వారా ఇరాన్‌కు హెచ్చరికలు పంపారనీ రాసుకొచ్చింది. శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి చర్యలకు దిగితే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని అమెరికా వర్గాలు భావిస్తున్నట్లు ప్రచురించింది.


ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇటీవల బహిరంగంగా విమర్శించారు. లెబనాన్‌లో హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చలకు ఆటంకం కలిగే అవకాశముందని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.


ఇవీ చదవండి:

ఇరాన్ అగ్రనేతలను కాపాడిన అమెరికా.. సంచలన విషయాలు వెలుగులోకి!

ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి: హంటర్ బైడెన్ వ్యంగ్యాస్త్రాలు

Updated Date - Jul 04 , 2026 | 11:11 AM