ట్రంప్‌నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి: హంటర్ బైడెన్ వ్యంగ్యాస్త్రాలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:22 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్ చేస్తున్నానంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హంటర్ బైడెన్ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇరాన్ యుద్ధాన్ని పదేపదే ముగించానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ఆయన విమర్శించారు. ఈ మేరకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్ చేస్తున్నానంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హంటర్ బైడెన్ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
హంటర్ బైడెన్ ఎక్స్ పోస్టు..
'డొనాల్డ్ జె.ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా నామినేట్ చేస్తున్నాను. చరిత్రలో ఒకే యుద్ధాన్ని ఇన్ని సార్లు ఆపిన అధ్యక్షుడు ఎవరూ లేరు. సీఎన్‌ఎన్ లెక్కల ప్రకారం ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ కనీసం 38 సార్లు ముగించారు. ఇది నోబెల్ కమిటీ గుర్తించాల్సిన రికార్డు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు హంటర్ వ్యాఖ్యలను చమత్కారంగా అభివర్ణించగా.. ట్రంప్ మద్దతుదారులు కూడా తమదైన శైలిలో ప్రతిస్పందించారు. ట్రంప్‌ను నిజంగానే నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిగా పేర్కొంటూ పలువురు పోస్టులు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. కాగా, ఇటీవలి కాలంలో హంటర్ బైడెన్ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ట్రంప్ మద్దతుదారులు, తన తండ్రిపై విమర్శలు చేసే వారిపై తరచూ స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా విదేశాంగ విధానంలో తన కృషికి గానూ తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని ట్రంప్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అధికారంలో ఉన్న సమయంలో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అధ్యక్షులు ఇద్దరే. వుడ్‌రో విల్సన్ 1920లో, బరాక్ ఒబామా 2009లో ఈ గౌరవాన్ని అందుకున్నారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ భిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఈ ఉద్రిక్తతపై ఆయన పదేపదే తన వైఖరిని మార్చుకుంటున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. భయాందోళనలో ప్రజలు..
తక్షశిలకు మరమ్మతులు చేపట్టిన పాక్.. యునెస్కో తీవ్ర ఆగ్రహం..