Share News

పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై బీఎల్ఏ దాడి.. 30 మంది భద్రతా సిబ్బంది హతం..

ABN , Publish Date - Jul 04 , 2026 | 10:15 AM

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది.

పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై బీఎల్ఏ దాడి.. 30 మంది భద్రతా సిబ్బంది హతం..
Pakistan vs Balochistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ జిల్లా పాన్వాన్‌లోని పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఇవాళ (శనివారం) ప్రకటించింది. ఈ దాడిలో 30మందికి పైగా కోస్ట్‌గార్డ్ సిబ్బంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది.


తమ ఆత్మాహుతి విభాగమైన మజీద్ బ్రిగేడ్ ఈ దాడికి పాల్పడిందని బీఎల్ఏ ప్రకటించింది. అటౌల్లా బలూచ్ అలియాస్ అజ్మల్ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కుతో కోస్ట్‌గార్డ్ శిబిరాన్ని పేల్చినట్లు తెలిపింది. ఈ భారీ పేలుడుతో భవనం శిథిలాలుగా మారిందని పేర్కొంది. పేలుడు అనంతరం తమ సాయుధ విభాగమైన ఫతెహ్ స్క్వాడ్ ప్రాణాలతో బయటపడిన కోస్ట్‌గార్డ్ భద్రతా సిబ్బందితో ఎదురుకాల్పులకు దిగినట్లు బీఎల్‌ఏ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 30మందికి పైగా కోస్ట్‌గార్డ్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు బీఎల్‌ఏ మీడియా విభాగం హక్కల్ దాడికి సంబంధించిన 43 సెకన్ల వీడియోను విడుదల చేసింది. అందులో పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కు శిబిరంలోకి ప్రవేశించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


మరోవైపు, ఈ ఘటనపై పాకిస్థాన్ సైన్యం లేదా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కాగా, తమ లక్ష్యం బలూచిస్థాన్‌కు పూర్తి స్వాతంత్ర్యం సాధించడమేనని, ఆ దిశగా పాకిస్థాన్ భద్రతా బలగాలపై సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని బీఎల్‌ఏ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తమ అధికారిక వేదికల ద్వారా వెల్లడిస్తామని బీఎల్ఏ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు.. 40 మంది ప్రయాణికుల మృతి

అల్లూరి సీతారామరాజు.. ధైర్యసాహసాలకు ప్రతీక: హోంమంత్రి అనిత

Updated Date - Jul 04 , 2026 | 10:25 AM