పాకిస్థాన్‌లో లోయలో పడిన బస్సు.. 40 మంది ప్రయాణికుల మృతి
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:58 PM
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. లోయలో పడింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారు.
ఇస్లామాబాద్, జులై 02: పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలో షేరానీ జిల్లాలో ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న షేరానీ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఝోబ్‌లోని ట్రామా సెంటర్‌కు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇదీ కూడా ఒకటని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు.. 36 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి బయలుదేరిందని పేర్కొన్నారు. అయితే దారి మధ్యలో ఇంకో బస్సు సాంకేతిక లోపంతో ఆగిపోయిందని, దీంతో అందులోని ప్రయాణికులందరినీ క్వెట్టా నుంచి వస్తున్న బస్సులోకి ఎక్కించారని తెలిపారు. ఇలా చేయడం వల్ల బస్సు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయిందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమైందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జి నియామకంపై కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ చేసిన ఏపీ టీడీపీ చీఫ్
సాయికృష్ణ కేసు.. కోర్టుకు కీలక విషయాలు తెలిపిన సిట్
For More International News And Telugu News