Share News

తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జి‌ నియామకంపై కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ చేసిన ఏపీ టీడీపీ చీఫ్

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:43 AM

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జి‌ నియామకంపై కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ చేసిన ఏపీ టీడీపీ చీఫ్
AP TDP Chief Palla Srinivasa rao

అమరావతి, జులై 02: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ను పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ నియామకం జరిగినట్లు ఆయన వివరించారు.


ఇక తిరుపతి ఇన్‌ఛార్జిగా ఎం. సుగుణమ్మ కొనసాగుతున్నారు. ఆమెను ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె బిజీ అయ్యారు. అదే సమయంలో స్థానిక నాయకుడు మన్నెం శ్రీనివాస ప్రసాద్ యాక్టివ్ అయ్యారు. పార్టీ తరఫున తన వాయిస్ వినిపిస్తూ.. తిరుపతి వేదికగా పలు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.


అదీకాక ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు స్థానిక వైసీపీ నేతల విమర్శలను ఆయన సమర్థవంతంగా తిప్పికొడతారని టీడీపీ అగ్రనాయకత్వం భావించింది. మరో వైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌‌ఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ను నియమించినట్లు సమాచారం.

Updated Date - Jul 03 , 2026 | 12:42 PM