ఇరాన్ అగ్రనేతలను కాపాడిన అమెరికా..! సంచలన విషయాలు బయటపెట్టిన NYT
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:09 AM
ఇరాన్ అగ్రనేతలు.. యుద్ధ విరమణ కోసం జరిపే శాంతి చర్చల ప్రతినిధులైన విదేశాంగ మంత్రి అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్‌లపై ఇజ్రాయెల్ ప్లాన్ చేసిన 'హత్య కుట్ర'ను అమెరికా ముందే పసిగట్టి, ఇరాన్‌ను అప్రమత్తం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడినట్లు ఒక సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.
వాషింగ్టన్, జూలై 3: పశ్చిమాసియా సంక్షోభంలో సరికొత్త అంతర్జాతీయ రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి.. అమెరికా, ఇజ్రాయెల్ మైత్రి బీటలు వారిందని చెప్పేందుకు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. ఇరాన్ అగ్రనేతలు, శాంతి చర్చల ప్రతినిధులైన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్ లపై ఇజ్రాయెల్ వేసిన 'హత్య ప్రణాళిక' ను అమెరికా ముందే పసిగట్టి, ఇరాన్‌ను అప్రమత్తం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' (NYT) ఈ రక్షణ రహస్యాలను బహిర్గతం చేసింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమార్చిన తర్వాత, ఇరాన్ ఉన్నత స్థాయి నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్ వ్యూహం రచించింది. అయితే, ఏప్రిల్ 8న జరిగిన మొదటి తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత అమెరికాతో అణు, శాంతి చర్చలు జరపడానికి ఇరాన్ తరఫున అరాగ్చీ, గాలిబాఫ్ బాధ్యతలు చేపట్టారు. ఇది ఇజ్రాయెల్‌కు ససేమిరా ఇష్టం లేదు.
మిడ్-ఎయిర్ డ్రామా.. గాలిబాఫ్ విమానం అత్యవసర ల్యాండింగ్
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 12న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో చర్చలు ముగించుకుని తిరిగి ఇరాన్‌కు విమానంలో ప్రయాణమయ్యారు. గాలిబాఫ్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడానికి ఇజ్రాయెల్‌కు చెందిన రెండు ఫైటర్ జెట్స్ ఇరాక్ మీదుగా ఇరాన్ వైమానిక పరిధిలోకి ప్రవేశించాయి. ఈ నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ ముందే గుర్తించి, ప్రాంతీయ దేశాల (పాకిస్థాన్, ఖతార్) మధ్యవర్తుల ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి అత్యవసర హెచ్చరికలు పంపింది. సమాచారం అందిన వెంటనే ఇరాన్ రక్షణ దళాలు గాలిబాఫ్ విమానాన్ని టెహ్రాన్‌కు వెళ్లకుండా దారి మళ్లించి, ఈశాన్య ప్రాంతంలోని 'మషద్' (Mashhad) నగరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించాయి. ఆ తర్వాత గాలిబాఫ్ రోడ్డు మార్గంలో సురక్షితంగా టెహ్రాన్ చేరుకున్నారు.
ఇజ్రాయెల్‌ను అమెరికా ఎందుకు అడ్డుకుంది?
ఇరాన్‌తో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఆ దేశ ప్రధాన దౌత్యవేత్తలను ఇజ్రాయెల్ హతమరిస్తే, చర్చలు పూర్తిగా దారి తప్పి, అమెరికా కూడా నేరుగా ఇరాన్‌తో పెద్ద ఎత్తున యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని వాషింగ్టన్ భయపడింది. 'వారినీ చంపేస్తే ఇక మనం శాంతి చర్చలు జరపటానికి ఇరాన్‌లో ఒక్క నేత కూడా మిగలడు' అని పాకిస్థాన్ దౌత్యవేత్తలు కూడా అమెరికాకు స్పష్టం చేశారు. దీంతో అమెరికా స్వయంగా రంగంలోకి దిగి ఇజ్రాయెల్‌ను వెనక్కి తగ్గాలని ఆదేశించిందని కూడా సదరు నివేదిక వెల్లడించింది.
ఇదిలా ఉంటే, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. జూన్ 2025లో జరిగిన 12 రోజుల యుద్ధంలో, అలాగే ఈ ఏడాది జరిగిన ఘర్షణల్లో ఇరాన్ భూగర్భ బంకర్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల శిథిలాల నుంచి గాలిబాఫ్ రెండుసార్లు ప్రాణాలతో బయటపడ్డారు.
అమెరికా-ఇజ్రాయెల్‌ల మధ్య పెరిగిన దూరం !
ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మధ్య ఇటీవల కాలంలో తీవ్రమైన విభేదాలు రావడానికి ఈ ఘటనే పునాది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, ఇజ్రాయెల్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ, అమెరికా.. ఇరాన్‌తో విడిగా చర్చలు జరిపి 14 అంశాల అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
విజయ్ ప్రభుత్వం కూల్చివేత కుట్ర కేసులో మరో నలుగురి అరెస్టు
ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కారు