చలికాలంలో ఆరోగ్యం జాగ్రత్త
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:32 AM
చలికాలంలో ఉష్ణోగ్రత్తలు తగ్గడంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సంగారెడ్డి జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్యామ్‌సుందర్
సంగారెడ్డి: చలికాలంలో ఉష్ణోగ్రత్తలు తగ్గడంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కె.శ్యామ్‌సుందర్ తెలిపారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
చలి ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది?
ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు చలితో ప్రమాదం పొంచిఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం, సాయంత్రం చల్ల గాలికి తిరగకూడదు. వెచ్చని గదుల్లో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోనే యోగా, ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరం వెచ్చగా ఉంటుంది. విటమిన్-డి లోపం రాకుండా ఉదయం 15 నిమిషాలు ఎండలో గడపడం మంచిది. చలికి కీళ్లు బిగుసుకుపోయి రక్తప్రసరణ నెమ్మదించడంతో నొప్పులు పెరుగుతాయి. తేలికపాటి వ్యాయామం, నడక ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. చల్లటి గాలి తగలకుండా ఉన్ని స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్ ధరించాలి. చెవులలోకి చల్లని గాలి వెళ్లకుండా జాగ్రత్త పడటం ద్వారా పక్షవాతం వంటి సమస్యలను నివారించవచ్చు.
ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి?
రోగ నిరోధకశక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. తాజాగా వండిన వేడి ఆహారం, సూప్‌లు, చిరుధాన్యాలను తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, వెల్లుల్లి, విటమిన్-సి ఉండే ఆహారాన్ని భోజనంలో చేర్చుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజుకు 8 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. బయటి ఆహారాన్ని తీసుకోవద్దు. చలికి చర్మం పొడిబారి పగుళ్లు రాకుండా కొబ్బరినూనె, గ్లిజరిన్ లేదా విటమిన్-ఈ ఉన్న మాయిశ్చరైజర్లను స్నానం చేసిన తర్వాత వాడాలి. వేడి నీటితో స్నానం చేయడం ద్వారా చర్మంలోని సహజ తేమ తగ్గిపోతుంది. గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Read Latest AP News And Telangana News And International News And Telugu News