Share News

లిఫ్ట్‌ ఆపరేటరే స్టాఫ్‌నర్స్‌..ఇంటర్‌ చదివిన వ్యక్తే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌

ABN , Publish Date - Aug 19 , 2026 | 11:52 AM

రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో లిఫ్ట్‌ ఆపరేటరే స్టాఫ్‌నర్స్‌గా.. ఇంటర్‌ చదివిన వ్యక్తే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లిఫ్ట్‌ ఆపరేటరే స్టాఫ్‌నర్స్‌..ఇంటర్‌ చదివిన వ్యక్తే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌
Osmania General Hospital

  • ‘ఉస్మానియా’ ఔట్‌సోర్సింగ్‌ నియామకాల్లో అడ్డదారులు

  • లక్షలు చేతులు మారుతున్న వైనం!

  • అర్హత లేని వారికి అందలం

  • పట్టించుకోని అధికారగణం

హైదరాబాద్: రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో లిఫ్ట్‌ ఆపరేటరే స్టాఫ్‌నర్స్‌గా.. ఇంటర్‌ చదివిన వ్యక్తే హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నియమించిన సిబ్బందిని కాదని, నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వ్యక్తులతో కీలకమైన విధులను నిర్వహింపజేస్తుండడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ వైద్యుడి స్థానంలో మరొకరిని పెట్టి విధులు నిర్వహించిన ఉదంతం మరవకముందే, అంతకు మించిన అక్రమాలు ఉస్మానియా ఆస్పత్రిలో వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.


లిఫ్ట్‌ ఆపరేటర్‌.. స్టాఫ్‌నర్స్‌ అయ్యాడు..

సిబ్బంది కొరతను సాకుగా చూపి ఆస్పత్రి ఉన్నతాధికారులు ఆడుతున్న నాటకం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. గతంలో కలెక్టర్‌ సమక్షంలో ఇంటర్వ్యూలు చేసి 217మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన నియమించారు. వీరికి రూ.18వేల నుంచి రూ.25వేల వరకు వేతనాలను నిర్ణయించి విధుల్లో తీసుకున్నారు. వీరిలో కొందరు ఇటీవల ప్రభుత్వ నోటిఫికేషన్‌ రావడంతో ఉద్యోగం వదిలేశారు. ఖాళీ అయిన పోస్టుల్లో ఎలాంటి అర్హత లేని, ఎస్‌ఎస్సీ, ఇంటర్మీడియట్‌ చదివిన వారిని హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లుగా, స్టాఫ్‌ నర్సులుగా, ల్యాబ్‌ టెక్నీషియన్లుగా అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉన్నతాధికారులు నియమించారు.


కనీస వైద్య పరిజ్ఞానం లేని ఒక లిఫ్ట్‌ ఆపరేటర్‌ను స్టాఫ్‌నర్స్‌గా, స్టాఫ్‌నర్స్‌ అర్హత ఉన్న మరొకరిని ల్యాబ్‌ టెక్నీషియన్‌గా మార్చి విధులు కేటాయిస్తున్నారు. ఒక సాధారణ ఇంటర్‌ చదివిన వ్యక్తి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ లాంటి బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్నాడంటే ఇక్కడి పరిస్థితులు ఎంత అడ్డగోలుగా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితిలో వచ్చే రోగులకు వైద్యం అందించే విషయంలో ఈ ‘నకిలీ’ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి.


hos.jpgఏజెన్సీలపై ఒత్తిడి..?

సరైన అర్హత లేకున్నవారిని ఆర్‌ఎంఓలే స్వయంగా సంతకాలు చేసి విధుల్లోకి తీసుకుంటున్నారు. వారికి జీతాలు చెల్లించాలంటూ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలపై తీవ్ర ఒత్తిడి కూడా చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సదరు అక్రమ నియామకాలను ఏజెన్సీలు అంగీకరించకపోతే, వారి బిల్లులను కూడా నిలిపివేస్తూ అధికారులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.


సూపరింటెండెంట్‌ వివరణ..

ఈ విషయమై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ సహాయిని వివరణ కోరగా.. కొత్తగా నియామకాలు చేపట్టలేదని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన స్టాఫ్‌నర్స్‌ నియామకాల్లో చాలామంది ఉస్మానియా నుంచి వెళ్లిపోగా వారి స్థానంలో కొత్తవారు ఎలా వచ్చారని అడిగిన ప్రశ్నకు ఆయన పొంతనలేని సమాధానం చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.


లక్షలు చేతులు మారుతున్నాయ్‌..

ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో సుమారు 60 నుంచి 70మంది పోస్టులు ఖాళీ కాగానే ఎవరి ప్రమేయం లేకుండా వెంటనే ఉన్నతాధికారులు కొత్త వారిని ఆయా ఉద్యోగాల్లో నియమించారు. అవుట్‌సోర్సింగ్‌లో చేరితే ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్‌లో వెయిటేజ్‌ మార్కులు కలిపే అవకాశం ఉన్నందున ఈ ఉద్యోగాలకు తీవ్రమైన డిమాండ్‌ ఉంది. ఒక్క ఉద్యోగానికి లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దందా వెనుక కొంతమంది ఆస్పత్రి రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు (ఆర్‌ఎంఓ), మరికొందరు వైద్యుల హస్తం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఇవీ..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 11:59 AM