Share News

వద్దన్నా... పెళ్లి చేశారు!

ABN , Publish Date - Aug 19 , 2026 | 10:15 AM

‘‘అంతా మీరే చేశారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. మీరంతా కలిసి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. బ్రెయిన్‌వాష్‌ చేసి ఒత్తిడి తెచ్చినందునే నేను పెళ్లి చేసుకున్నా’’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడు జోగి రాజీవ్‌ తన తల్లిదండ్రులపై మండిపడ్డారు.

వద్దన్నా... పెళ్లి చేశారు!

  • బ్రెయిన్‌ వాష్‌ చేసి ఒప్పించారు

  • జోగి రమేశ్‌పై కుమారుడు రాజీవ్‌ ధ్వజం

  • కారు, గొలుసు ఇవ్వలేదంటూ కోడలిపై

  • జోగి భార్య రుసరుసలు

  • ఇక్కడికి రాకు అంటూ రాజీవ్‌ హుకుం

విజయవాడ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ‘‘అంతా మీరే చేశారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. మీరంతా కలిసి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. బ్రెయిన్‌వాష్‌ చేసి ఒత్తిడి తెచ్చినందునే నేను పెళ్లి చేసుకున్నా’’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడు జోగి రాజీవ్‌ తన తల్లిదండ్రులపై మండిపడ్డారు. వివాహ జీవితానికి సంబంధించితన అశక్తతను కూడా అంగీకరించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తిరుగుతున్నాయి. తనపై హత్యాయత్నం, వేధింపులకు పాల్పడ్డారంటూ జోగి రాజీవ్‌ భార్య మేఘన... గత నెల 24న విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె 20 వీడియోలు, రికార్డింగ్‌ వాయి్‌సలను పెన్‌డ్రైవ్‌లో పోలీసులకు అందజేశారు.


దీనిపై జోగి రమేశ్‌ సహా మొత్తం 11 మందిపై కేసు నమోదైంది. దీనికంటే ముందే ఇరుపక్షాల కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు పంచాయితీ జరిగింది. అప్పుడు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోలే ఇప్పుడు బయటపడ్డాయి. ‘ఎన్ని చేసినా, ఎన్ని మాటలు అన్నా భరించాను. జీవితంలో హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు ఇలా చేశారు’ అని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలకు తెలిసేలా తమ పెళ్లి చేశారని, ఇప్పుడు తన తప్పులేదనే విషయం కూడా అందరికీ తెలియాలని ఆమె స్పష్టం చేశారు. ‘‘నన్ను ఒత్తిడి చేయడంతో పెళ్లికి అంగీకరించాను. నీతో మంచిగా ఉండాలని ఈ పెళ్లి చేసుకున్నా. మేఘన ఫ్రెండ్‌ హర్ష, వాడి బాబు, మరో అంకుల్‌ కలిసి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూర్చోబెట్టి బలవంతంగా పెళ్లికి ఒప్పించారు’’ అని రాజీవ్‌ పేర్కొన్నారు.


ఒక దశలో తండ్రిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెళ్లయిన 20 రోజుల్లోనే తనను పంపిచేశారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకున్నా’ అని మేఘనతో అన్నారు. జోగి రమేశ్‌ భార్య శకుంతల... సూర్యపేటలోని తన పుట్టింట్లో ఉన్న కోడలు మేఘనతో ఫోన్‌లో కార్లు, కానుకల గురించి అడిగిన మాటలూ బయటికి వచ్చాయి. ‘‘పెళ్లప్పుడు వాడికి (రాజీవ్‌కు) ఏం పెట్టారు? పెళ్లయి ఇన్ని రోజులయింది. మీ ఇంట్లో మా వాడికి ఏమి విలువ ఇస్తున్నారు? మీ ఇంట్లో విలువ ఉన్నప్పుడు కదా వాడు బాగుండేది? రొయ్యల వ్యాపారం చేద్దామని అడగమన్నాను. ఎప్పుడైనా వాడిని అడిగావా? మా ఇంటి అమ్మాయిగా భావించి నీకు ఎంతో పెట్టాం. వాడికేం ఇచ్చారు? కనీసం వాడికి గొలుసు అయినా ఇచ్చారా? కారు ఇవ్వమని అడిగాం. అదీ కొనలేదు. మీ డాడీకి చెప్పు’’ అని శకుంతల రుసరుసలాడారు.


ఇక్కడికి రాకు... అక్కడే ఉండు...

మేఘన: తన పుట్టింట్లో ఉండగా రాజీవ్‌ ఫోన్‌ చేసి విరుచుకుపడిన సంభాషణలూ బయటికి వచ్చాయి. ‘నువ్వు ఇక్కడికి రాకు. అక్కడే ఉండు’ అంటూ మేఘనపై రాజీవ్‌ మండిపడ్డారు. ఇదీ ఆ సంభాషణ...

రాజీవ్‌: నీవల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు. నీ ఇంట్లో నువ్వు బతుకు నా ఇంట్లో నేనుంటా.

మేఘన: ఇప్పుడేమైంది... నేనేమన్నాను!

రాజీవ్‌:ఇక్కడ నాకు టార్చర్‌ పెడుతున్నారు. నువ్వు వస్తే ఇంకా ఎక్కువవుతుంది. నాకు విడాకులు కూడా వద్దు. నా ఇంట్లో నేనుంటా. నీ జీవితం నేను చూసుకుంటా.

మేఘన: అసలు ఎవరేమన్నారు?

రాజీవ్‌:(గట్టిగా అరుస్తూ) నువ్వు రాకు. అసలు ఎవరు నువ్వు... నన్ను డిస్టర్బ్‌ చేయొద్దు.

మేఘన: ఎవరేంటి... నువ్వు పెళ్లి చేసుకోలేదా... ?

రాజీవ్‌:ఊరుకోవమ్మా. ఇక్కడికి వస్తే మీ అమ్మాబాబులను కలిసి పంచాయితీ పెట్టుకోడానికి రా!

మేఘన: నీకే అంత టార్చర్‌ ఉంటే నాకెంత ఉండాలి! అసలు ఎందుకు అరుస్తున్నావు.?

రాజీవ్‌:నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఇక్కడికి రాకు. ఇది నీ ఇల్లు కాదు... నీకు సంబంధం లేదు!


జోగిపై 21న తీర్పు

కోడలిని వేధించడంతోపాటు హత్యాయత్నం చేసిన కేసులో జోగి రమేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును 21న వెల్లడిస్తామని మహిళా సెషన్స్‌ కోర్టు తెలిపింది. కోడలు మేఘన చేసిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు మొత్తం 11 మందిపై కేసు పెట్టిన విషయం తెలిసిందే.


వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 10:56 AM