మెగా డీఎస్సీపై వైసీపీ ఆందోళన.. ఏపీ మండలిలో హైటెన్షన్
ABN , Publish Date - Aug 19 , 2026 | 10:17 AM
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం శాసనమండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు (బుధవారం) శాసనమండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. డీఎస్సీపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెడలో నల్ల కండవాలతో ఆ పార్టీ సభ్యులు సభకు వచ్చారు. వైసీపీ సభ్యులు ఆందోళనతో ఏపీ శాసన మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు.
వైసీపీ సభ్యులు సభను గౌరవించటం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
వైసీపీ సభ్యులు సభను గౌరవించటం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చైర్మన్ సభను ఆర్డర్‌లో పెట్టాలని సూచించారు. చైర్మన్ టేబుల్‌ను కొడుతూ ఎందుకు నినాదాలు చేస్తున్నారని ప్రశ్నించారు. సభా మర్యాద కాపాడాల్సిన బాధ్యత సభ్యులపైనా ఉందని తెలిపారు. మనోహర్ వ్యాఖ్యలపై చైర్మన్ కొయ్యే మోషేను రాజు అసహనం వ్యక్తం చేశారు. సభా నిర్వహణ, నిబంధనల గురించి మీకు బాగా తెలుసు అని అన్నారు. వారిపై ఎలాంటి చర్యలు ఎలా తీసుకోవాలో మీకు తెలుసునని చెప్పారు.
సభ సంప్రదాయాల ప్రకారం జరగాలి: అచ్చెన్నాయుడు
సభ సంప్రదాయాల ప్రకారం జరగాలని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ హయాంలో కూడా మీరు చైర్మన్‌గా వ్యవహరించారని అన్నారు. రెడ్ లైన్ గీసి విపక్షాల వాళ్లు దాటి వస్తే సస్పెండ్ చేశారని ప్రస్తావించారు. ఇప్పుడు కూడా అలాగే చేసేందుకు మీకు అధికారాలున్నాయని తెలిపారు. మూడు రోజులుగా సభకు అంతరాయం కలిగిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. చైర్మన్‌ను కించపరచాలనే ఆలోచన తమకు లేదని.. ఆయనకు పవర్స్ ఉన్నాయని చెప్పారు.
వార్తలు కూడా చదవండి...
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News