కంటిపాప జాగ్రత్త.. చిన్నారుల్లో మయోపియా ముప్పు
ABN , Publish Date - Aug 06 , 2026 | 08:23 AM
మయోపియా ఉన్న పిల్లలకు దగ్గరలోని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ దూరంలోని వస్తువులు మసకగా కనిపిస్తాయి
డిజిటల్ స్క్రీన్ వాడకంతో పెరుగుతున్న దగ్గరి చూపు సమస్యలు
హైదరాబాద్ సిటీ: మీ పిల్లలకు బ్లాక్ బోర్డుపై రాసిన అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదా.. టీవీకి చాలా దగ్గరగా కూర్చోవడం, దూరంలోని వస్తువులను చూడటానికి కళ్లను ముడుచుకోవడం చేస్తున్నారా.. ఈ లక్షణాలను చాలామంది తల్లిదండ్రులు సాధారణంగా కళ్లజోడు అవసరమని భావిస్తారు. ఇవి పిల్లల్లో వేగంగా పెరుగుతున్న మయోపియా (దగ్గరి చూపు) ప్రారంభ సంకేతాలు కావచ్చని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 21వ శతాబ్దంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యల్లో మయోపియా ఒకటి. డిజిటల్ పరికరాల వినియోగం పెరగడం, మొబైల్, టాబ్లెట్, కంప్యూటర్లపై ఎక్కువసేపు చదవడం, బయట ఆటలు తగ్గిపోవడం వంటి మార్పులతో పట్టణ ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థుల్లో మయోపియా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు వివరించారు.
మయోపియా అంటే...?
మయోపియా ఉన్న పిల్లలకు దగ్గరలోని వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ దూరంలోని వస్తువులు మసకగా కనిపిస్తాయి. మయోపియా రావడానికి జన్యుపరమైన, పర్యావరణ కారణాలు రెండూ ఉంటాయి. మయోపియా చిన్న వయస్సులోనే ప్రారంభమై పిల్లల ఎదుగుదలతో పాటు పెరిగే అవకాశం ఉంది. కళ్లజోడుతో చూపును సరిచేయవచ్చు కానీ వ్యాధి పురోగతిని నియంత్రించకపోతే కంటి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు. సరైన పవర్ ఉన్న కళ్లజోడు ధరించడం, ప్రత్యేక మయోపియా 8 కంట్రోల్ కళ్లజోడు లెన్స్‌లు, కొన్ని ప్రత్యేక కాంటాక్ట్ లెన్స్‌లు, నేత్ర వైద్యుల పర్యవేక్షణలో తక్కువ మోతాదు అట్రోపిన్ కంటి చుక్కలు వేసుకోవడం చేయాలని చెబుతున్నారు.
6.00 డయాప్టర్లు దాటితే హైపర్
మయోపియా తీవ్రత 6.00 డయాప్టర్లు అంతకంటే ఎక్కువ అయితే దాన్ని హై మయోపియా అంటారు. దీంతో భవిష్యత్తులో రెటీనా వేరుపడటం, గ్లకోమా, క్యాటరాక్ట్, మయోపిక్ మాక్యులర్ డీజనరేషన్ వంటి తీవ్రమైన కంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
3 నుంచి 8 ఏళ్ల పిల్లల్లో..
మయోపియా ఎక్కువగా 3 నుంచి 8 ఏళ్ల పిల్లల్లో కనిపిస్తుంది. కొందరిలో పదేళ్ల వయస్సులో బయటపడుతుంది. హైదరాబాద్‌లోని ఎల్వీపీఈఐలోని పిల్లల విభాగంలో ప్రతీ రోజు 15 నుంచి 20 మంది మయోపియా సమస్యతో వస్తున్నట్లు వైద్యులు చెప్పారు. విద్యార్థి బ్లాక్ బోర్డు చూసి రాయడంలో ఇబ్బంది పడటం, చదువులో వెనుకబడడం వంటి లక్షణాలు ఉంటే చికిత్స అవసరమని అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన వెలుతురులో చదివేలా చూడాలి. మొబైల్‌లకు దూరంగా ఉంచడం, అవుట్ డోర్ గేమ్స్ ఆడమని చెప్పడం, మంచి పౌష్టికాహారం ఇవ్వడం చేయాలి. దృష్టి లోపాల నివారణకు పిల్లలు 20-20-20 నియమం పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, కనీసం 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News