Share News

గౌరవప్రద జీవనం కోసమే...

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:12 AM

వెనుకబడిన వర్గాలు గౌరవప్రదంగా సమాజంలో జీవించేందుకు బీసీ రక్షణ చట్టం వీలు కల్పిస్తుందని మంత్రులు తెలిపారు. కులం, వృత్తుల పేరుతో దూషిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

గౌరవప్రద జీవనం కోసమే...

  • బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం.. జాతీయ బీసీ కమిషన్‌కు ముసాయిదా

  • అనుమతి రాగానే అసెంబ్లీలో చట్టం

  • మంత్రులు సవిత, అచ్చెన్న వెల్లడి

  • బీసీ మంత్రులు, నేతలతో సమావేశం

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాలు గౌరవప్రదంగా సమాజంలో జీవించేందుకు బీసీ రక్షణ చట్టం వీలు కల్పిస్తుందని మంత్రులు తెలిపారు. కులం, వృత్తుల పేరుతో దూషిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. బీసీ ముసాయిదా రక్షణ చట్టంపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బుధవారం విజయవాడలో కీలక సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రులు సబిత, అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రతిపాదిత చట్టంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలో జిల్లా స్థాయిలో బీసీ సంఘాల ప్రతినిధుల సలహాలు కూడా స్వీకరిస్తామని తెలిపారు. ముసాయిదా బిల్లును జాతీయ బీసీ కమిషన్‌కు పంపించి.. అక్కడ నుంచి అనుమతి రాగానే అసెంబ్లీలో ఆమోదానికి ప్రవేశపెడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందని, బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. బీసీలను వేధించినా, జాతి, కుల వృత్తుల పేరుతో దూషించినా శిక్షార్హులవుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. బీసీ రక్షణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


టీడీపీ ఆవిర్భావం నుంచీ బీసీలు అండగా ఉంటూ వచ్చిందన్నారు. ‘‘దేశంలో ఎన్నో చట్టాలున్నాయి. కానీ, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం లేదు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. మంత్రి నారా లోకేశ్‌ పాదయాత్రలో బీసీలు తమ కష్టాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు’’ అని వివరించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌ది అని, ఆ రిజర్వేషన్లను 27 శాతానికి పెంచిన ఖ్యాతి సీఎం చంద్రబాబుదన్నారు. గత ప్రభుత్వంలో బలహీనవర్గాలపై కక్షకట్టి రిజర్వేషన్లు తగ్గించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్‌ బీసీ కమిషన్‌ వేశామని, బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేలా కృషి చేస్తామని అచ్చెన్న తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారఽథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌, ఎండీ ఫరూక్‌, ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు, బొమ్మిడి నాయకర్‌, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, గల్లా మాధవి, కాగితపు కృష్ణప్రసాద్‌, పితాని సత్యనారాయణ, గౌతు శిరీష, చదలవాడ అరవిందబాబు తదితరులు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బీద రవిచంద్ర; బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్‌ మల్లికార్జునరావు, పలువురు న్యాయ నిపుణులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌గా మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, అనిత, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొని సూచనలు అందజేశారు.

Updated Date - Aug 06 , 2026 | 05:13 AM