గర్భిణి మృతి కేసులో ల్యాబ్ టెక్నీషియన్ అరెస్ట్
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:29 AM
రెండు సార్లు జైలుకు వెళ్లొచ్చినా అతడిలో మార్పు రాలేదు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా మళ్లీ అదే దందాను కొనసాగిస్తూ మరో సారి పోలీసులకు చిక్కాడు.
అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైనం
జనగామ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రెండు సార్లు జైలుకు వెళ్లొచ్చినా అతడిలో మార్పు రాలేదు. లింగ నిర్ధారణ నేరమని తెలిసినా మళ్లీ అదే దందాను కొనసాగిస్తూ మరో సారి పోలీసులకు చిక్కాడు. ఇటీవల ఓ గర్భిణికి లింగ నిర్ధారణ చేయగా, ఆమె అబార్షన్ చేయించుకునే క్రమంలో గత నెల 25న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో మృతురాలి తల్లితోపాటు నర్సు, ఆర్‌ఎంపీ వైద్యుడిని ఈ నెల 1న అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా లింగ నిర్ధారణ పరీక్ష చేసిన ల్యాబ్ టెక్నీషియన్ ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్‌కు చెందిన వేముల ప్రవీణ్.. ఎలాంటి అనుమతులు లేకుండానే అలా్ట్రసౌండ్ యంత్రాలను కొనుగోలు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇతడిపై 5 కేసులు నమోదు కాగా 2021లో ఒక సారి, 2023లో మరో సారి జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిలో మార్పు రాకపోగా తిరిగి తన దందాను కొనసాగిస్తున్నాడు. ఇటీవల దేవరుప్పుల మండలం కోలుకొండకు చెందిన శ్రావణికి సైతం ఇతనే లింగనిర్ధారణ పరీక్షలు చేశాడు. అబార్షన్ చేయించుకునే క్రమంలో వికటించి.. ఆమె మృతి చెందింది.