మార్కెట్లోకి మిల్లెట్ బియ్యం
ABN , Publish Date - May 08 , 2026 | 08:27 AM
జొన్నల పిజ్జా.. కొర్రల బర్గర్.. రాగి పాస్తా.. సామల నూడుల్స్.. ఒరిగెల పులావ్.. వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుందా..! చిరుధాన్యాలతోనూ ఇవి చేసుకోవచ్చా.. అని ఆశ్చరంగా ఉందా..? అవే కాదు, వందకుపైగా రుచికరమైన వంటకాలు మిల్లెట్స్‌తో వండుకోవచ్చని చెబుతున్నారు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) శాస్త్రవేత్తలు.
చిరుధాన్యాలతో పిజ్జా, బర్గర్లు, బిర్యానీలు
ఇడ్లీ, ఉప్మా, పొంగల్ రెడీమిక్స్‌లు లభ్యం
చపాతీలంత సులభంగా జొన్న, రాగి రొట్టెల పిండి
హైదరాబాద్ సిటీ: జొన్నల పిజ్జా.. కొర్రల బర్గర్.. రాగి పాస్తా.. సామల నూడుల్స్.. ఒరిగెల పులావ్.. వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుందా..! చిరుధాన్యాలతోనూ ఇవి చేసుకోవచ్చా.. అని ఆశ్చరంగా ఉందా..? అవే కాదు, వందకుపైగా రుచికరమైన వంటకాలు మిల్లెట్స్‌తో వండుకోవచ్చని చెబుతున్నారు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) శాస్త్రవేత్తలు. ఐదు రకాల చిరుధాన్యాలతో తయారైన బియ్యాన్ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు అదే సంస్థలోని న్యూట్రీహబ్ సీఈఓ డా. జె. స్టాన్లీ తెలిపారు. ఆధునిక జీవనశైలితో మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక జబ్బుల తాకిడి ఎక్కువవుతోంది.
ఈ పరిస్థితుల్లో మనం ఏం తినాలి? ఎలా తినాలి? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో వందల సార్లు మెదలకమానవు. అందుకు సమాధానంగా ‘‘బామ్మలు, తాతలు పాటించిన ఆహార పద్ధతులను ఆశ్రయించడమే’’ ఉత్తమం అని జాతీయ పోషకాహార సంస్థ మొదలు ఎంతో మంది వైద్యులు సైతం సూచిస్తున్నారు. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు చిరుధాన్యాలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనంలో పేర్కొంది. మధుమేహం, ఊబకాయం నియంత్రణకు చిరుధాన్యాలు సత్ఫలితాలిస్తున్నట్లు వెల్లడించింది. కొర్రలు, రాగి, సజ్జలను ఆహారంగా తీసుకున్న వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువ నమోదైనట్లు జాతీయ పోషకాహార సంస్థ పరిశోధనలో తేలింది. అంతేకాదు, జీర్ణక్రియ మెరుగవడంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని సిఫార్సు చేసింది.
ఆ బియ్యంతో బిర్యానీ, పులిహోర
రుచికరమైన కూరతో అన్నంకలిపి తింటేనే చాలామందికి కడుపు నిండిన భావన. సంకటి, జావలు, రొట్టెలు తినడం ఒకటి రెండు పూటలవరకు ఓకే అంటారు. అంతకుమించి లోనికెళ్లదని చెబుతారు. షుగర్ పెరిగితే మరొక రెండు మాత్రలు ఎక్కువ మింగడానికి సిద్ధపడతారు కానీ వరన్నం మానేయడం లేదా తగ్గించడానికి ససేమిరా అంటారు. అలాంటి వారికోసమే చిరుధాన్యాలతో ఎనలాగ్ బియ్యం తయారు చేశారు ఐఐఎంఆర్ పరిశోధకులు. అది కేవలం చూడడానికే కాదు, వరన్నంలాగే తెల్లగా, కూరతో కలిపి ముద్దగా చేసుకొని తినడానికి అనువుగా, రుచిగా ఉంటుంది.
బిర్యానీ, పులిహోర, పులావ్ లాంటి కమ్మని వంటకాలెన్నో ఎనలాగ్ రైస్‌తో వండుకోవచ్చు. ఎనలాగ్ బియ్యం ఎక్కువ సేపు నానబెట్టనవసరం లేదు. 8 నిమిషాల్లోనే ఉడుకుతుంది. అయితే గంజి వార్చే ప్రక్రియలో వీటిని వండాలి. ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని ఐఐఎంఆర్ ఆహార ఉత్పత్తుల కొనుగోలు కేంద్రంలో మాత్రమే ఎనలాగ్ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి విడుదల చేస్తామని డైరెక్టర్ తారాసత్యవతి చెప్పారు. ప్రస్తుతం 350గ్రాముల ఎనలాగ్ రైస్‌ను రూ.65కు విక్రయిస్తున్నామని, సరైన మార్కెట్ ధర ఇంకా నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు.
పిండి నుంచి బియ్యం తయారీ
‘‘మిల్లెట్స్‌ను ముందుగా దేనికదే పిండి పట్టిస్తాం. దాన్ని మరొక మిషీన్‌ద్వారా ఎక్స్‌ట్రూషన్‌చేయగా బియ్యం గింజల రూపంలోకి వస్తాయి. వాటిని ఆరబెట్టి ప్యాక్ చేస్తామని’’ ప్లాంట్ సూపర్‌వైజర్ కార్తీక్ చెప్పారు. చిరుధాన్యాలతో కేకులు, బ్రెడ్, బిస్కెట్లు, కూకీస్, మఫిన్లు, సేమియా, పేలాలు, పాస్తా, న్యూట్రీబార్, కారప్పూస, జంతికలు వంటి రుచికరమైన పదార్థాలు మరెన్నో న్యూట్రీహబ్ లో తయారుచేస్తున్నారు.
సులభంగా జొన్నరొట్టెలు
జొన్న, సజ్జలతో మోడిఫైడ్ పిండిని కొద్దిరోజుల్లో అందుబాటులోకి తేనుంది ఐఐఎంఆర్. చపాతీ కర్రతో ఒత్తుతూ మోడిఫైడ్ పిండితో చాలా తేలిగ్గా రొట్టెలు చేయచ్చు. మిల్లెట్ ఇడ్లీ, పొంగల్, సూప్ రెడీమిక్స్‌లు సైతం భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ప్రాంగణంలో లభ్యమవుతాయి. మిల్లెట్ ఆహార ఉత్పత్తుల ఆధార అంకుర సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 101వెరైటీల తయారీలో సాంకేతిక సహకారాన్ని తమ సంస్థ అందిస్తోందని స్టాన్లీ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదే జరిగితే.. 107 మంది రాజీనామా!
Read Latest Telangana News and National News