సాదాబైనామాకు సవాలక్ష చిక్కులు
ABN , Publish Date - May 08 , 2026 | 07:16 AM
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇచ్చేశామని, నిబంధనలను మరింత సరళతరం చేశామని ప్రభుత్వం, అధికారులు పదే పదే చెబుతున్నారు.
అమ్మిన వ్యక్తి పేరు ఆన్‌లైన్లో లేదని తాజాగా తిరస్కరణ
గతంలో సాదాబైనామా కింద భూమి అమ్మింది తండ్రి
ఇప్పుడు ఆన్‌లైన్లో అతని కుమారుల పేర్లు నమోదు
సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవడం లేదని అర్జీల తిరస్కరణ
ఆధార్ నంబరుకు లక్ష అడుగుతున్న అమ్మకందారులు
హైదరాబాద్, మే 7 (ఆంధ్ర జ్యోతి): సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇచ్చేశామని, నిబంధనలను మరింత సరళతరం చేశామని ప్రభుత్వం, అధికారులు పదే పదే చెబుతున్నారు. అమ్మకందారు నుంచి అఫిడవిట్ అవసరం లేదని మార్గదర్శకాల్లో స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు. అయినా, అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇందుకు తాజాగా తెరపైకి వచ్చిన సాంకేతిక సమస్య.. ఆన్‌లైన్లో అమ్మకందారు పేరు లేకపోవడం! నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రైతు తెల్ల కాగితం మీద రాయించుకుని రెండెకరాల పొలం కొన్నాడు. అతనికి విక్రయించిన వ్యక్తి పేరు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదనే కారణంతో దరఖాస్తును తిరస్కరించారు. కనీసం అమ్మిన వ్యక్తి నుంచి ఆధార్ నంబరు తీసుకురావాలని చెబుతున్నారని, రూ.లక్ష ఇస్తేనే ఆధార్ నంబరు ఇస్తామని విక్రయదారులు కొర్రీలు వేస్తున్నారని సదరు రైతు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఘటనలో.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు సాదాబైనామా దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే, అక్కడ అతనికి భూమి విక్రయించిన రైతుకు చెందిన ముగ్గురు కుమారుల పేర్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. దాంతో, సిస్టమ్ ఎవరి పేరూ తీసుకోవడం లేదని చెప్పి తన దరఖాస్తును తిరస్కరించారని సదరు రైతు వాపోయారు. సీసీఎల్‌ఏ ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా.. సాదాబైనామా విషయంలో ఏదో ఒక తిరకాసు దరఖాస్తుదారులను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9,00,880 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నోటీసు జారీ చేసిన 30 రోజుల్లో వీటన్నిటినీ క్లియర్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ, నోటీసు దశలోనే కొర్రీలు వేసి.. తిరస్కరిస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి అఫిడవిట్లు అవసరమని గతంలో మార్గదర్శకాలు ఇచ్చారు. సమస్య జటిలమవడంతో కొనుగోలుదారు ఒక్కరే అఫిడవిట్ ఇస్తే చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ.. ఇప్పుడు భూమి అమ్మిన యజమాని పేరు ఆన్‌లైన్‌లో లేదనే సాకుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. నిజానికి, గతంలో ఒక వ్యక్తి సాదాబైనామాపై మరో వ్యక్తికి భూమి అమ్మాడు. ఆ తర్వాత కొంత కాలానికి అతని పిల్లల పేర్లు ఆన్‌లైన్లో చేరాయి. ఇప్పుడు సాదాబైనామాకు ఆ పిల్లలు అంగీకరించడం లేదు. అలాగే, గతంలో అమ్మిన వ్యక్తులు వారి పేరు ఆన్‌లైన్‌లో ఉంటే పాస్ పుస్తకం రద్దవుతుందనే భయంతో.. పేర్లు నమోదు చేయించుకోలేదు. కొనుగోలు చేసిన వ్యక్తికి ఇప్పుడు అదే అడ్డంకిగా మారింది. 13బి జనరేట్ కావాలంటే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అమ్మిన వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. 13బి ఉంటేనే కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ భూమిపై చట్టబద్ధమైన హక్కు లభిస్తుంది. దానిని జారీ చేసిన తర్వాతే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు తీసుకోవాలన్నా ఇది తప్పనిసరి. ఇప్పుడు అమ్మకందారు నుంచి ఆమోదం తీసుకురాలేకపోతే.. ఆ దరఖాస్తును వెంటనే తిరస్కరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.