Share News

బీఆర్‌ఎస్‌ వాళ్లే బట్టేబాజ్‌గాళ్లు!

ABN , Publish Date - May 08 , 2026 | 07:14 AM

రైతులను ఆదుకోని, వారి సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోని బీఆర్‌ఎస్‌ నేతలే బట్టేబాజ్‌ గాళ్లని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు.

బీఆర్‌ఎస్‌ వాళ్లే బట్టేబాజ్‌గాళ్లు!

  • ఎన్నికల్లో బొందపెట్టినా ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారు

  • రైతుల కన్నీళ్లతో రాజకీయం చేస్తున్నారు..: తుమ్మల

  • హనుమకొండలో ముగిసిన 3 రోజుల రైతు మేళా

హనుమకొండ, మే 7 (ఆంధ్రజ్యోతి): రైతులను ఆదుకోని, వారి సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోని బీఆర్‌ఎస్‌ నేతలే బట్టేబాజ్‌ గాళ్లని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. పదేళ్లలో రూ.లక్ష రుణ మాఫీ చేయలేక రైతులపై రూ.12 కోట్ల వడ్డీ భారాన్ని మోపితే.. బీఆర్‌ఎ్‌సను వారు చీదరించుకొని ఛీకొట్టి ఓడించారన్నారు. ఇప్పుడు రైతులను కష్టాలను ఓట్లుగా మార్చుకొని తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి రైతు మేళాలో చివరి రోజైన బుధవారం పాల్గొన్న మంత్రి తుమ్మల.. రైతు సభలో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ‘రుణమాఫీలో మీరే బట్టేబాజ్‌ గాళ్లు.. ఏ ఒక్క రైతుకు కూడా సమయానికి రుణమాఫీ చేయలేదు. ఆర్థిక పరమైన కష్టాలెన్ని ఉన్నా.. గత ప్రభుత్వం అప్పుల పాలు చేసినా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. రైతులపై వడ్డీ భారం పడుకుండా 22 లక్షల కుటుంబాలకు 40 బ్యాంకుల ద్వారా రూ.31 వేల కోట్లను 3 నెలల్లోనే ఖాతాల్లో వేశాం. బీఆర్‌ఎస్‌ రైతు బంధు అని చెప్పి మిగతా పథకాలన్నింటినీ బంద్‌ చేసి రైతులను కష్టాల పాలు చేసింది. యూరియాపై మాట్లాడే దరిద్రులకు బుర్రుండాలి. యూరియా రావలసిన దేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే.. అక్కడి నుంచి రాకపోకపోయినా 11 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేశాం’ అని వ్యాఖ్యానించారు. నాడు రాహుల్‌ గాంధీ ఇక్కడికొచ్చి ఇచ్చిన హామీల మేరకు బీఆర్‌ఎస్‌ చేయలేని పనులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేశామని చెప్పారు. కాకతీయుల గడ్డ అయిన వరంగల్‌లోనే పిచ్చిమాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు క్షమించబోరన్నారు.


రైతుల నుంచి మక్కలు కొంటున్నది ఒక్క రేవంత్‌ ప్రభుత్వమేనని తెలిపారు. రైతులను పట్టించుకోని బీఆర్‌ఎస్‌ను ప్రజలు బొందపెడితే.. మళ్లీ వచ్చి ఆ పార్టీ నేతలు రైతుల కన్నీళ్లను ఓట్ల రూపంలో మార్చుకోవాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి అనేక విధాలుగా తోడ్పాటునందిస్తున్నారన్నారు. రైతు సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌ రెడ్డి, కేఆర్‌ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు తదితరులు మాట్లాడారు. ఆయిల్‌పామ్‌ రైతులకు మంత్రులు చెక్కులను పంపిణీ చేశారు.

Updated Date - May 08 , 2026 | 07:14 AM