Share News

30 ఏళ్ల నుంచే మొదలు..!

ABN , Publish Date - Apr 07 , 2026 | 10:18 AM

ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే డయాబెటిస్‌, హై బీపీ, ఫ్యాటీ లివర్‌ వంటి జీవనశైలి వ్యాధులు ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో వేగంగా పెరుగుతున్నాయి.

30 ఏళ్ల నుంచే మొదలు..!

  • జీవన శైలి వ్యాధులతో ముప్పు

  • 30 శాతం పెరిగిన రోగులు..

  • నేడు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ: ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే డయాబెటిస్‌, హై బీపీ, ఫ్యాటీ లివర్‌ వంటి జీవనశైలి వ్యాధులు ఇప్పుడు 30 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో పనిచేసే ఉద్యోగులు, బిజీ లైఫ్‌స్టైల్‌లో అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది వ్యాధులను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఇతర కారణాల కోసం డాక్టర్‌ను కలిసినప్పుడు లేదా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే ప్రతీ నలుగురిలో ఒకరికి హైబీపీ ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.


కానీ చాలా మందికి తమకు బీపీ ఉందనే విషయం తెలియదు. అలాగే డయాబెటిస్‌. చెక్‌పలను కూడా చాలా మంది వాయిదా వేస్తారు. లక్షణాలు కనిపించే సమయానికి వ్యాధి ముదిరి ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. నగర జీవనశైలి ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. ఎక్కువ పని గంటలు, ఒత్తిడి, అసమయ భోజనం, ఫాస్ట్‌ఫుడ్‌ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, పెరుగుతున్న వేడి ప్రభావం ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి. జీవనశైలి మారినా ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు చాలా మందిలో కనిపించడం లేదు.


ఆస్పత్రులకు క్యూ..

ఆస్పత్రులకు వెళ్తున్న రోగుల సంఖ్య ప్రతీ రోజు రెట్టింపు అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయిదేళ్ల క్రితం ఒక్కో ప్రభుత్వ ఆస్పత్రికి 1000 నుంచి 1200 ఓపీ ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2000కు మించుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ కనీసం 50 వేలకు మించి ఓపీ చికిత్సలు తీసుకుంటారని ఓ అంచనాగా వైద్యులు చెబుతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతుంటాయి. నిమ్స్‌లో 2,500 మంది రోజూ ఓపీ పరీక్షలు చేయించుకుంటున్నారు. గతం కంటే 30 శాతం రోగుల సంఖ్య పెరిగిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రతీ ఒక్కరినీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్‌ 7వ తేదీన అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి ఆరోగ్యం కోసం ఐక్యంగా.. విజ్ఞానానికి అండగా నిలబడదాం అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు.


city6.2.jpgరోజువారీ ఆహారం ఇలా..

ఉదయం టిఫిన్‌ : 60 గ్రాముల గింజ ధాన్యాలు, 25 గ్రాముల పప్పులు, 150 మి.లీ. పాలు ఉండాలి.

మధ్యాహ్న భోజనం : 75 గ్రాముల గింజ ధాన్యాలు (దాదాపు 2 కప్పుల అన్నం లేదా మూడు పుల్కాలు), ఆకుకూరలు, 50 మి.లీ. పెరుగు లేదా 30 గ్రాముల పన్నీర్‌, 100 గ్రాముల మాంసాహారం ఉండాలి. 50 గ్రాముల సలాడ్‌ ఉండాలి.

సాయంత్రం : 50 గ్రాముల గింజ ధాన్యాలు, పప్పులు (చిరుతిండి), 50 మి.లీ. పాలు లేదా 10 గ్రాముల చక్కెర (టీ).

రాత్రి భోజనం : మధ్యాహ్నం భోజనం మాదిరిగానే ఉండాలి. 75 గ్రాముల గింజ ధాన్యాలు (దాదాపు 2 కప్పుల అన్నం లేదా మూడు పుల్కాలు), కూరగాయలు, పప్పులు వద్దనుకుంటే 100 గ్రాముల మాంసాహారం ఉండాలి.

రాత్రి 11 గంటలకు మజ్జిగ లేదా ఒక పండు తీసుకోవాలి.

వంటల్లో మిక్స్‌డ్‌ ఆయిల్స్‌ను వినియోగించాలి.


మంచి ఆరోగ్యం కోసం..

  • పొగ తాగడం, నమలడం, గుట్కా, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

  • 30 ఏళ్లు పైబడిన వారు గ్లూకోజ్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌, బీపీ పరీక్షల్లాంటివి చేయించుకోవాలి.

  • మహిళలు క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి.

  • రోజుకు 250 మిల్లీమీటర్ల కాచి, చల్లార్చిన పాలు తాగితే మంచిది.

  • కాఫీ కంటే టీ మంచిది. అదీ ఒకటి రెండు సార్లే.

  • మునగాకులు, తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారట్‌, మంచి గుమ్మడి, మామిడి, బొప్పాయి ఆహారంలో తీసుకోవాలి.


city6.3.jpg

ఆరోగ్యం కోసం ఇలా చేయాలి

రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. 7-8 గంటల పాటు నిద్ర ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం యోగ, ధ్యానం చేయాలి. శుద్ధి చేసిన పిండిపదార్థాలకు బదులుగా సంపూర్ణ ధాన్యాలను ఎంచుకోవాలి. చక్కెర, ఉప్పు, అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారాలను తగ్గించాలి. రోజుకు సుమారు 2-3 లీటర్ల నీటిని తాగాలి.

  • డాక్టర్‌ డి. రవిశేఖర్‌

రెడ్డి, సీనియర్‌ ఫిజీషియన్‌, డయాబెటాలజిస్టు, కిమ్స్‌ హాస్పిటల్‌


ఏ పరీక్షలు చేయించుకోవాలి..

మనకు బాగానే ఉంది పరీక్షలు అవసరం లేదనుకోవడం పొరపాటు. ఏటా సాధారణ పరీక్షలు చేయించుకుంటే చాలా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రించవచ్చు. ప్రీవెంటివ్‌ హెల్త్‌ ఇప్పుడు తప్పనిసరి. 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు పరీక్ష, కొలెస్ట్రాల్‌ను అంచనా వేయడానికి లిపిడ్‌ ప్రొఫైల్‌, లివర్‌ ఫంక్షన్‌ టెస్టులు, అలాగే శరీర బరువు, బాడీ మాస్‌ ఇండెక్స్‌ వంటి అంశాల పరిశీలన ఉండాలి.

- డాక్టర్‌ గురు ప్రసాద్‌, జనరల్‌ మెడిసిన్‌, క్లినికల్‌ డైరెక్టర్‌, కేర్‌ హాస్పిటల్‌


ఈ వార్తలు కూడా చదవండి:

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 07 , 2026 | 10:18 AM