పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం
ABN , Publish Date - Apr 07 , 2026 | 09:28 AM
పశ్చిమబెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
చొరబాటుదారులకు సీఎం రెడ్‌కార్పెట్
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ సిటీ: పశ్చిమబెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం హైకోర్టు సమీపంలోని మురళీధర్ ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్ అనంతరం బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగాల్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేసేందుకు కేంద్రం ముందుకొస్తే... మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు.
చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. బీజేపీకి ఓటేసి దేశ భద్రతలో భాగస్వాములు కావాలని బెంగాల్ ప్రజలను కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడున్న వాళ్లు తమ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి బీజేపీకి ఓటేయించాలని ఆయన కోరారు. పాతబస్తీలో అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులపై మజ్లిస్ ఎమ్మెల్సీ, నాయకులు అడ్డుకుని దౌర్జన్యం చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకునే పాపాన పోలేదన్నారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తుంటే అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై, పేదలపై లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టారని, మరి అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న అధికారులపై మజ్లిస్ దాడులు చేస్తున్నా కనీసం కేసులు పెట్టలేని అసమర్థ సర్కార్ నడుస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పాతబస్తీలో అధికారులు, పోలీసులపై జరుగుతున్న దాడులపై సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..
Read Latest Telangana News and National News