డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కత్తితో పొడిచి స్నేహితుడి హత్య
ABN , Publish Date - Apr 07 , 2026 | 08:37 AM
అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్న యువకుడిని తోటి స్నేహితులే కత్తితో పొడిచి హత్య చేశారు.
బాలాపూర్ పీఎస్ పరిధిలో ఘటన
హైదరాబాద్: అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాలని బెదిరిస్తున్న యువకుడిని తోటి స్నేహితులే కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్ రెడ్డి, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వాదీ ఏ సాలెహిన్‌కు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ కుమారుడు మొహమ్మద్ నసీర్, అలియాస్ నబ్బు, (22) ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు, ఇతనికి స్థానికులైన దస్తగిర్, ఇలియాస్, ఫాహద్, నదీమ్‌లు స్నేహితులు.
అయితే, నసీర్ తరచు గా డబ్బు కోసం వీరిని వేధిస్తూ ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించే వాడు. దాంతో స్నేహితులు భయపడి డబ్బు ఇచ్చేవారు. ఆదివారం రాత్రి అందరూ కలసి మద్యం సేవించారు. మరింత మద్యం కావాలని పట్టుబట్టిన నసీర్ తనతో తెచ్చుకున్న కత్తితో స్నేహితులను బెదిరించాడు.
దీంతో కోపోద్రిక్తులైన స్నేహితులు నసీర్ వేధింపులు భరించలేమని నిర్ణయించుకొని అతని వద్ద ఉన్న కత్తితోనే పొడిచి, రాళ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దీంతో నసీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..
Read Latest Telangana News and National News