తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..
ABN , Publish Date - Apr 06 , 2026 | 09:49 PM
ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటు మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటు మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇవాళ(సోమవారం) తీవ్ర విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. నేడు ఒక్కరోజే పిడుగులు పడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. దర్శి మండలం చామంతపూడిలో పిడుగు పడి ఆవుల మల్లికార్జున్(22) అనే యువకుడు మృత్యువాతపడ్డాడు.
ముండ్లమూరు మండలం పసుపుగల్లులో పిడుగుపాటుకు రావులపల్లి శివరామకృష్ణ ప్రాణాలు కోల్పోయారు. ఇక, మార్కాపురం జిల్లా పుల్లలచెరువులో మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగు పడి కన్నయ్య అనే యువకుడు చనిపోగా.. మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలోనూ పిడుగుపాటుకు నాగయ్య మృతిచెందాడు. కనిగిరి మండలం కలగట్ల రైల్వేస్టేషన్ వద్ద పిడుగుపడి దుర్గేశ్ తుదిశ్వాస విడిచాడు. మరోవైపు విజయనగరం జిల్లా వంగరలోనూ పిడుగుపాటుకు మహిళా రైతు మృతిచెందారు. పొలంలో మొక్కజొన్న ఏరుతుండగా పిడుగుపాటుకు గురై ఇనముల నర్సమ్మ(48) ప్రాణాలు కోల్పోయారు.
కాగా, నిన్న(ఆదివారం) కూడా ఇలాగే మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బి.కేసుపురంలో పొలం పనులకు వెళ్లిన తల్లీకుమార్తె మడియ కృష్ణవేణి(35), మడియ యోగేశ్వరి(15) సైతం పిడుగుల కారణంగా ప్రాణాలు వదిలారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కలవగుంటలో గీత కార్మికుడు వి.కామరాజ్(35)పైనా పిడుగుపడి తుదిశ్వాస విడిచాడు. రెండ్రోజుల వ్యవధిలోనే 8 మంది ప్రాణాలు కోల్పోగా.. బాధిత కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పోలీసులకు చిక్కిన నకిలీ కరెన్సీ ముఠా.. పక్కా ప్లాన్‌తో అడ్డంగా బుక్కయ్యారు..
పిఠాపురం ప్రజలకు గుడ్ న్యూస్.. పవన్ చొరవతో రూ.37.25 కోట్లు విడుదల