విద్యార్థులతో పనులు.. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:57 PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రెండ్రోజుల కిందట విద్యార్థులతో పనులు చేయించారు. పనులు చేస్తుండగా 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతికి తీవ్రగాయమైంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా: అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులతో పని చేయించడంపై ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది.
అసలేం జరిగిందంటే..
అంబాజీపేట జడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు రెండ్రోజుల కిందట విద్యార్థులతో పనులు చేయించారు. పనులు చేస్తుండగా 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతికి తీవ్రగాయమైంది. దీంతో బాలుడిని హుటాహుటిన అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం కాస్తా ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగమానస దృష్టికి వెళ్లింది. దీనిపై ఆమె సీరియస్ అయ్యారు. చికిత్సపొందుతున్న బాలుడి వద్దకు కమిషన్ సభ్యురాలు వెళ్లారు. చిన్నారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్యులను అడిగి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం బాధితుడి తల్లిదండ్రులతోనూ మాట్లాడారు నాగమానస. అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. మరోవైపు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతారహితంగా విద్యార్థులతో పనులు చేయించారని ఆగ్రహించారు కమిషన్ సభ్యురాలు. పాఠశాల పరిధిలో బాలల చేత పనులు చేయించడం చట్టవిరుద్ధమని.. ఇది బాలల హక్కులపై ప్రత్యక్ష దాడిగా ఆమె అభివర్ణించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక తయారు చేసి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వైసీపీ పెద్ద డ్రామా కంపెనీలా తయారయ్యింది: ఎమ్మెల్సీ అనురాధ
విజయవాడలో అగ్ని ప్రమాదం.. కారు దగ్ధం