Share News

వైసీపీ పెద్ద డ్రామా కంపెనీలా తయారయ్యింది: ఎమ్మెల్సీ అనురాధ

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:04 PM

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A పేరుతో విశాఖలో వేల ఎకరాల చుక్క భూములను కబ్జా చేయడాన్ని దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. అమరావతి అంటే కేవలం భూములు కాదు.. అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు.

వైసీపీ పెద్ద డ్రామా కంపెనీలా తయారయ్యింది: ఎమ్మెల్సీ అనురాధ
MLC Panchumarthi Anuradha

అమరావతి: వైసీపీ రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలను మభ్యపెట్టే డ్రామా కంపెనీలా తయారైందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. శాసనసభలో ఒకవైపు అమరావతే రాజధాని అని ఒప్పుకుంటూనే.. బయట మాత్రం రాజధానిపై విషం చిమ్మడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అమరావతి అభివృద్ధిని దోపిడీ అంటున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసలైన దోపిడీ అంటే ఏంటో తెలుసుకోవాలని మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు సంపాదించడాన్ని దోపిడీ అంటారని.. అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరగడాన్నీ దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ చెప్పుకొచ్చారు.


దోపిడీ అంటే..

పోలవరం ప్రాజెక్టు పని మొదలు పెట్టకుండానే మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో నిధులు వెనకేసుకోవడమే దోపిడీ అని.. మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు వసూళ్లు చేయడాన్ని కూడా దోపిడీ అంటారని జగన్‌కు చురకలు అంటించారు. మైనింగ్ లీజుల పేరుతో దోచుకోవడం అసలైన స్కామ్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22A పేరుతో విశాఖలో వేల ఎకరాల చుక్క భూములను కబ్జా చేయడాన్ని దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. అమరావతి అంటే కేవలం భూములు కాదు.. అది ఐటీ హబ్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీలు, వేల మంది యువతకు ఉపాధి కల్పించే గ్లోబల్ సెంటర్ అని కొనియాడారు. ఏపీ రాజధాని లేని పరిస్థితిని చూసి దేశమంతా జాలిపడుతోందని, ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం పార్లమెంట్‌లో ఈ విషయంపై మాట్లాడటం వైసీపీ నైతిక ఓటమికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.


ప్రెస్ మీట్లతో బురద..

రాజధానిని ఎలా దెబ్బతీయాలా అనే కుట్రతోనే వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారితో ప్రెస్ మీట్లు పెట్టించి బురద చల్లుతున్నారని ఆగ్రహించారు ఎమ్మెల్సీ. రాజధానిపై ఒక స్పష్టమైన విజన్ లేకపోగా అమరావతిపై ఇన్ని అబద్ధాలు ఆడటం కేవలం కక్ష సాధింపు చర్యే అంటూ నిప్పులు చెరిగారు. గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదని.. జగన్ ఆడిన అబద్ధాలన్నింటినీ మంత్రి లోకేశ్ వీడియోల సాక్ష్యంతో సహా బయటపెట్టారని తెలిపారు. మంత్రి లోకేశ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కేవలం బురద చల్లడమే లక్ష్యంగా వైసీపీ నాయకత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్ని అవమానించడం తగదని వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్‌కు ఎమ్మెల్సీ అనురాధ హితవుపలికారు.


జగన్‌ది కాలక్షేపం..

బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకే ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేశారని అనురాధ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకోకుండా రాజధానిపై అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. రాజధాని లాంటి సీరియస్ అంశాలపై చర్చ వస్తే.. సమాధానం చెప్పలేక 'మావిగన్' అని అర్థం లేని పదాలతో కాలక్షేపం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

మూలపేట పోర్టుపై విష ప్రచారం.. వైసీపీపై మంత్రుల ఫైర్

ఘోరం.. పిడుగుపాటుకు ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..

Updated Date - Apr 06 , 2026 | 06:03 PM