చల్లపల్లి ఘటనలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన హోం మంత్రి
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:49 PM
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసి ధైర్యం చెప్పిన హోం మంత్రి.. వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.
అమరావతి, ఏప్రిల్ 6: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు ఘటనలో గాయపడ్డ పోలీసులను హోంమంత్రి అనిత(Home Minister Anitha) పరామర్శించారు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పారు హోం మంత్రి. పోలీసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా క్రాకర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుకాణాల నుంచి సీజ్ చేసిన టపాసులను కోర్టుకు తరలిస్తుండగా పేలుడు జరిగిందన్నారు. ఈ ఘటనలో ఎస్సై, కోర్ట్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయన్నారు. అబ్దుల్లా అనే కానిస్టేబుల్ 50 - 60 శాతం గాయాలతో ఉన్నారని.. మిగతా వాళ్లకి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. గాయపడిన పోలీసుల ఆరోగ్య పరిస్థితులను కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
గాయపడిన వారు అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఎంతో ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందిస్తున్న ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ బృందానికి హోం మంత్రి అనిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం పవన్
Read Latest AP News And Telugu News