గర్భధారణపై వేసవి ప్రభావం ఉండదా?
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:03 AM
వేసవిలో గర్భధారణ, ఫెర్టిలిటీ చికిత్సల చుట్టూరా పలు అపోహలు అలుముకుని ఉంటున్నాయి. కానీ నిజానికి వేసవి కాలం... గర్భధారణ మీదా, ఫెర్టిలిటీ చికిత్సల మీదా...
అపోహలు - వాస్తవాలు
వేసవిలో గర్భధారణ, ఫెర్టిలిటీ చికిత్సల చుట్టూరా పలు అపోహలు అలుముకుని ఉంటున్నాయి. కానీ నిజానికి వేసవి కాలం... గర్భధారణ మీదా, ఫెర్టిలిటీ చికిత్సల మీదా ఎలాంటి ప్రభావం కనబరచదని అంటున్నారు వైద్యులు. మరిన్ని వివరాలు...
స్త్రీపురుష పునరుత్పత్తి వ్యవస్థల మీద వేసవి ప్రభావాల గురించిన అనుమానాలు, భయాలతో, దంపతులు ఈ కాలంలో గర్భధారణను వాయిదా వేస్తూ ఉంటారు. అయితే ఇది వాస్తవ విరుద్ధం. ఎందుకంటే....
గర్భధారణ సామర్థ్యం తగ్గదు
వేసవిలో గర్భధారణ కష్టమనీ, ఆ అవకాశాలు సన్నగిల్లుతాయని మహిళలు అపోహపడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అండాల విడుదల పూర్తిగా హార్మోన్ల మీదే ఆధారపడుతుంది. హార్మోన్ స్రావాలు మెదడు, అండాశయాల మీదే ఆధారపడతాయి కాబట్టి వీటికి కాలంతో పని ఉండదు. కాబట్టి అన్ని కాలాల మాదిరిగానే వేసవి కాలంలో కూడా అండాలు యధాతధంగా విడుదలవుతాయి
వేడి ప్రభావం ఉండదు
వేడి వల్ల మహిళల పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతినదు. అండాశయాలు, గర్భాశయం, అండాలు వేడి ప్రభావానికి ఏమాత్రం గురి కావు. మన శరీరాల్లో ‘హోమియోస్టేసిస్’ అనే స్వీయ నియంత్రణ ప్రక్రియ ఉంటుంది. ఫలితంగా అంతర్గత అవయవాలేవీ దెబ్బతినే వీల్లేకుండా, శరీర అంతర్గత ఉష్ణోగ్రత క్రమబద్ధంగా సాగుతూ ఉంటుంది. దాంతో అన్ని జీవక్రియల్లాగే, పునరుత్పత్తి జీవక్రియ కూడా క్రమబద్ధంగా సాగుతూ ఉంటుంది. దీనికి వేసవి వేడితో ఎలాంటి సంబంధం ఉండదు
నెలసరి క్రమం తప్పదు
నెలసరులు కూడా హార్మోన్ల మీదే ఆధారపడతాయి. కాబట్టి నెలసరికీ వేసవికీ సంబంధం ఉండదు. ఎక్కువ బరువు పెరిగినా, తగ్గినా, ఒత్తిడి, ప్రయాణాలు, డీహైడ్రేషన్ పెరిగినా నెలసరి క్రమం తప్పవచ్చు. అంతే తప్ప వేసవి వల్ల నెలసరులు క్రమం తప్పవు
వేసవిలో గర్భధారణ
వేసవిలో గర్భధారణ ప్రయత్నాలు మానుకోవలసిన అవసరం ఏమాత్రం లేదు. వేసవి కారణంగా, ఓవ్యులేషన్ ఇండక్షన్ లాంటి చిన్న చికిత్సల కోసమైనా, ఐయుఐ, ఐవిఎఫ్ లాంటి పెద్ద చికిత్సల కోసమైనా వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. గర్భఽధారణ విజయావకాశాలు అండాలు, అండాల విడుదల, వీర్యకణాలు, అండాల నాణ్యత, ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ వేసవి కారణంగా దెబ్బతినవు కాబట్టి ప్రత్యేకించి వేసవిలో గర్భధారణ చికిత్సలను వాయిదా వేయవలసిన అవసరం లేదు
పురుషుల మీద వేసవి ప్రభావం
మహిళలతో పాటు పురుషుల పునరుత్పత్తి వ్యవస్థ మీద వేసవి ప్రభావం ఉండదు. శరీర ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో వీర్యకణాల సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. కాబట్టే వీర్యకణాల నాణ్యత, సామర్థ్యాల మెరుగుదల కోసం హాట్ టబ్‌లో స్నానాలు చేయొద్దనీ, బిగుతైన లోదుస్తులు వేసుకోవద్దనీ, దీర్ఘ సమయాల పాటు ల్యాప్‌టా్‌పలను ఒళ్లో పెట్టుకుని పని చేయొద్దనీ, వైద్యులకు పురుషులకు సూచిస్తూ ఉంటారు. ఈ పనులన్నీ వీర్యకణాల సంఖ్యనూ, కదలికలనూ తగ్గిస్తాయి. కానీ వేసవి వాతావరణం ఒక్కటే పురుషుల వీర్యకణాల మీద ఎలాంటి ప్రభావాన్నీ కనబరచదు

వీర్యకణాల సామర్థ్యం ఏ మేరకు?
పురుషుల పునరుత్పత్తి సామర్థ్యం వేసవిలో తగ్గి, చలికాలంలో పెరుగుతుందనే అపోహ ప్రచారంలో ఉంది. కానీ ఇది నిజం కాదు. పురుష పునరుత్పత్తి వేసవిలో తక్కువగా, చలికాలంలో ఎక్కువగా ఉండదు. మన శరీరాల్లోని సహజసిద్ధ హోమియోస్టేసిస్ స్థితి, ఈ అంశానికి కూడా వర్తిస్తుంది. అన్ని కాలాల్లోనూ మన శరీరం అంతర్గత వ్యవస్థలన్నిటినీ ఎంతో మెరుగ్గా క్రమబద్ధీకరిస్తుంది. ఫలితంగా వేసవిలో కూడా బయటి ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వీర్యకణాల ఉత్పత్తి కొనసాగుతుంది. కాబట్టి వేసవిలో సైతం వీర్యకణాలు సజీవంగానే ఉంటాయి. అయితే డీహైడ్రేషన్ వల్ల మహిళల్లో అండాలు, పురుషుల్లో వీర్యకణాల నాణ్యత తాత్కాలికంగా తగ్గిపోవచ్చు. సమస్య తొలగిపోగానే ఈ పరిస్థితి కూడా తిరిగి సర్దుకుంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఫెర్టిలిటీ చికిత్సల పట్ల అవగాహన ఇలా...
ఫెర్టిలిటీ చికిత్సల పట్ల కూడా కొన్ని అపోహలు నెలకొంటున్నాయి. ఐవిఎఫ్ విజయావకాశాలు వేసవిలో తగ్గుతాయన్నది కూడా అపోహ మాత్రమే!
వయసు: మహిళల వయసు పెరిగేకొద్దీ గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతాయి. సహజసిద్ధ గర్భధారణ, ఐవిఎఫ్ విజయావకాశాలు పెరిగే వయసుతో తగ్గుతాయి. 30 ఏళ్ల లోపు గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. 30 నుంచి 35 ఏళ్ల వరకూ కొంత మేరకు అవకాశాలుంటాయి. 35 నుంచి అవకాశాలు క్షీణించడం మొదలుపెడతాయి. అంతకంటే వయసు పెరిగేకొద్దీ అవకాశాలు బాగా దిగజారతాయి. కాబట్టి వేసవి గురించి ఫెర్టిలిటీ చికిత్సలు వాయిదా వేసుకోకూడదు. ఆలస్యం చేసేకొద్దీ పైబడే వయసుతో గర్భధారణ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. పైబడే వయసు, ఎంబ్రియో నాణ్యత, గర్భాశయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యల మీద మాత్రమే గర్భధారణ అవకాశాలు ఆధారపడి ఉంటాయి తప్ప వేసవి మీద కాదు.
ఫెర్టిలిటీ చికిత్సలు: ఐవిఎఫ్ ల్యాబ్స్ అన్నీ కఠినమైన ఉష్ణోగ్రత నియంత్రణ ప్రమాణాలను కలిగి ఉంటాయి, క్రమబద్ధంగా పని చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫెర్టిలిటీ చికిత్సల మీద వేసవి ప్రభావం ఉండదు. వేసవి వేడి వల్ల ఎంబ్రియోలు కూడా దెబ్బ తినవు. ఎంబ్రియోలను కల్చర్ చేసే సమయంలో అంత్యంత నియంత్రిత ఇంక్యుబేటర్స్‌లో ఉంటాయి. ఈ ఇంక్యుబేటర్స్ నియంత్రిత ఉష్ణోగ్రతల్లో పని చేస్తాయి, ప్రతి క్షణం వాటి మీద పర్యవేక్షణ కొనసాగుతుంది కాబట్టి బయటి ఉష్ణోగ్రతల ప్రభావం ల్యాబ్‌లోని ఎంబ్రియోల మీద ఏమాత్రం ఉండదు. ఇందుకోసం ఉన్నత ప్రమాణాలు పాటించే ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులను ఫెర్టిలిటీ చికిత్సల కోసం ఎంచుకోవాలి
ఒవేరియన్ స్టిమ్యులేషన్: అండాల పెరుగుదలను ప్రేరేపించే ఇంజెక్షన్ల ప్రభావం వేసవిలో తగ్గదు. ఫెర్టిలిటీ చికిత్సలో అండాశయాలను ప్రేరేపించి, అండాల విడుదలను పెంచేవి మందులే తప్ప సీజన్లు కావు
ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్: ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ పూర్తిగా గర్భాశయం, హార్మోన్ నియంత్రిత ఎండోమెట్రియల్ రిసెప్టివిటీల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బయటి ఉష్ణోగ్రతకూ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కూ ఎలాంటి సంబంధం ఉండదు
వేసవిలో వాయిదా: ఫెర్టిలిటీ చికిత్సల విజయావకాశాలన్నీ వయసు, ఆరోగ్యం, అండాలు, వీర్యకణాల నాణత్య, సంఖ్యల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మెరుగ్గా ఉన్నప్పుడు వేసవిలో కూడా ఫెర్టిలిటీ చికిత్సలను కొనసాగించవచ్చు. అందుకోసం చలికాలం వరకూ ఆగవలసిన అవసరం లేదు
వీర్యకణాల నాణ్యత: ప్రత్యేకించి వేసవిలో ఫెర్టిలిటీ చికిత్సలు తీసుకునే సమయంలో వీర్యకణాల నాణత్య దిగజారుతుందన్నది కూడా అపోహే!
డాక్టర్ అఖిల అయ్యగారి
సీనియర్ కన్సల్టెంట్,
క్లౌడ్ నైన్ గ్రూప్
ఆఫ్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి
మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ.. తీర్పు వాయిదా వేసిన కోర్టు
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..