ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:33 PM
ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
ఆదిలాబాద్: జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి పాలన బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..'గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆదిలాబాద్ దూరంగా ఉంది. కేసులు, అక్రమ నిర్భందాలకు వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చాం. విపక్ష ఎమ్మెల్యేలను శత్రువులుగా కాంగ్రెస్ ప్రభుత్వం చూడదు. బీజేపీ, బీఆర్ఎస్ మాకు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే.. శత్రువులు కాదు. అభివృద్ధి పనుల కార్యక్రమానికి విపక్ష ఎమ్మెల్యేలను కూడా పిలిచాం. గతంలో ముఖ్యమంత్రి వస్తుంటే విపక్ష నేతలను అరెస్టులు, గృహనిర్భంధాలు చేసేవారు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా నిధులు ఇస్తున్నాం. మేం పార్టీలు చూడకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలు చూడటం లేదు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు. కానీ మేం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే రూ.5,400 కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. సన్నబియ్యంతో పేదల కడుపు నింపాలనే ఆలోచన గత పాలకులకు వచ్చిందా?. 2029 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల హద్దులు మార్చవద్దని కేంద్రం చెప్పింది. కేంద్రం ఆంక్షలు ఎత్తివేయగానే హద్దులు మారుస్తాం. కాళేశర్వం కూలేశ్వరం అయ్యింది. గత పాలకులు తుమ్మిడిహట్టిని పక్కనపెట్టి ఆదిలాబాద్‌కు అన్యాయం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ను నిర్మించి ఆదిలాబాద్‌కు నీళ్లిస్తాం' అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బంజారా నాయకులతో కల్వకుంట్ల కవిత భేటీ.. మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ.. తీర్పు వాయిదా వేసిన కోర్టు