హెచ్‌పీవీ వ్యాక్సిన్ వస్తోంది..
ABN , Publish Date - Mar 02 , 2026 | 10:15 AM
సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్ల వయసు ఉన్నబాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసేందుకు అర్హులను గుర్తించే పనిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధక చర్యలు
14 ఏళ్ల బాలికలకు ఉచితం.. వారంలో పంపిణీ
పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు
గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) టీకా మందు పంపిణీ జిల్లాలో మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.
భీమవరంటౌన్, మార్చి1 (ఆంధ్రజ్యోతి): సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్ల వయసు ఉన్న బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేసేందుకు అర్హులను గుర్తించే పనిలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. శనివారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ (HPV Vaccination Drive) ప్రారంభమైంది. జిల్లాకు సంబంధించి ఇంకా ఖరారు కాలేదని ఎంతమంది 14 ఏళ్ల బాలికలు ఉన్నారనే దానిపై గ్రామాల వారీగా సర్వే చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రూ.3,927 వ్యాక్సిన్ ఉచితం..
హెచ్‌పీవీ నుంచి రక్షణ కల్పించే గార్డాసిల్ వ్యాక్సిన్ ఒక డోసు ధర బహిరంగ మార్కెట్‌లో రూ.3,927 ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. తొలివిడతగా జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ పీహెచ్‌సీల్లో ఈ వ్యాక్సిన్‌ని 14 ఏళ్ల బాలికలకు అందజేయనున్నారు. జిల్లాలో 14 ఏళ్ల బాలికలు ఎంతమంది ఉన్నారో నిర్ధారించుకునేందుకు మూడు రోజులుగా సర్వే పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆధార్ కార్డులో నమోదైన వయసు ప్రాతిపదికగా వ్యాక్సిన్‌కు అర్హుల సంఖ్యను గుర్తించారు.
నాలుగు రకాల వైరస్‌ల నుంచి రక్షణ..
సింగిల్ డోసుగా అందజేసే వ్యాక్సిన్ ప్రధానంగా నాలుగు రకాల హెచ్‌పీవీ వైరస్‌లైన టైప్-6, 11, 16, 18 నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్యవర్గాలు వివరించాయి. సుమారు 70 - 80 శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు ఈ వైరస్‌లు కారణమవుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించి వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీ బాడీస్‌ను తయారు చేస్తుందని, భవిష్యత్‌లో క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుందని వైద్యులు వివరించారు.
పంపిణీకి మూడు నెలలు..
జిల్లాలో 4 పీహెచ్‌సీలు, 18 అర్బన్ పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో వ్యాక్సిన్ పంపిణీకి కోల్డ్‌చైన్ సౌకర్యాలు ఉన్న సెంటర్లను గుర్తించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందజేసిన వెంటనే గుర్తించిన (పీహెచ్‌సీలు/ యూపీహెచ్‌సీ) నిర్దేశిత బాలికలకు టీకా మందు పంపిణీని ప్రారంభించనున్నారు. సర్వేలో గుర్తించిన బాలికలందరికీ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి మూడునెలల గడువును పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా వ్యాక్సిన్ తీసుకోని బాలికలు ఎవరైనా ఉంటే రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద అంటే ప్రతీ బుధ, శనివారాల్లో టీకా మందు వేస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న బాలికల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే యువిన్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది
భయం అవసరం లేదు...
ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, సమర్థవంతమైన రోగ నిరోధక టీకాగా గుర్తించారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ని 70 నుంచి 30 శాతం వరకు తగ్గించగలదని అనేక పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది. కొన్నిరకాల క్యాన్సర్లను కూడా నివారించే ఆవకాశం ఉంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వేస్తారు. 0.5 మిల్లీ మోతాదు ఇంజక్షన్ ఇస్తారు. కండరంలో ఎడమ భుజానికి చేస్తారు. కొంతమందిలో సూదివేసిన ప్రాంతంలో నొప్పి, ఎరుపు, వాపు, జ్వరం, తలనొప్పి, అలసట, వాంతులు, వంటి స్వల్ప లక్షణాలు ఉంటాయి. మూడు రోజుల్లో తగ్గిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News