Healthy Food: ఇవి తింటే గుండె సంబంధిత వ్యాధులను దూరం పెట్టొచ్చు
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:23 PM
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు. మనం తినే ఆహారం గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
దేశంలో ఇటీవల గుండెపోటు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తీసుకునే ఆహారం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారం ద్వారా రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్త నాళాల్లో అడ్డంకులను అరికట్టి గుండె జబ్బులను దూరం పెట్టొచ్చు. గుండెకు మేలు చేసే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం.
ఆకుకూరలు(Leafy Greens): మార్కెట్ లో నిత్యం దొరికే పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ K, నైట్రేట్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇవి రక్త నాళాలను రక్షించి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
నట్స్, విత్తనాలు(Nuts & Seeds): వీటిలో ఉండే మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రోజుకు గుప్పెడు (సుమారు 30 గ్రాములు) తీసుకోవడం మంచిది.
ఆల్మండ్స్ (బాదం పప్పు) Almonds: ఇందులో విటమిన్ ఇ, ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. బరువు తగ్గించడం, మెదడు పనితీరు మెరుగుపరచడం, చర్మానికి పోషణ, ఎముకల బలానికి ఉపయోగపడతాయి.
తృణధాన్యాలు(Whole Grains): బ్రౌన్ రైస్, రాగులు, జొన్నలు, ఓట్స్ వంటి వాటిలో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
వెల్లుల్లి(Garlic): ఇది ఉల్లిజాతికి చెందిన మొక్క, వంటల్లో రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా చూడటానికి సహాయపడుతుంది. ఉదయం పూట ఒక రెబ్బ వెల్లుల్లి తినడం గుండెకు చాలా మంచిది.
పండ్లు(Fruits): పండ్లలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి, మామిడి, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి శరీరానికి బలాన్ని, శక్తిని అందిస్తాయి. ఇక స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె కణాలను రక్షిస్తాయి.
అవకాడో: ఇందులో ఉండే మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ని తగ్గించడమే కాదు, గుండె పనితీరు మెరుగుపరుస్తుంది.
ఫ్యాటీ ఫిష్ (Fatty Fish): చేపలు గుండె ఆరోగ్యానికి చక్కటి ఆహారం అని చెప్పొచ్చు. ముఖ్యంగా సాల్మాన్, మాకేరెల్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధీకరిస్తాయి, వాపులను తగ్గిస్తాయి.
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే దూరంగా ఉంచాల్సిన ఆహారం ఏంటంటే.. ప్యాకెట్ ఫుడ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్. ఇవి గుండెకు బద్ద శత్రువులనే చెప్పొచ్చు. ఆహారంతో పాటు ప్రతిరోజూ సాధ్యమైనంత వరకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం చేయడం వల్ల గుండె మరింత దృఢంగా మారుతుంది.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువగా నష్టపోతారు..
For More Latest News