Share News

రోగులకు సంజీవని ‘అభా’ కార్డు

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:24 AM

రోగులకు సంజీవని ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ (అభా) కార్డు. దీనిపై ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

రోగులకు సంజీవని ‘అభా’ కార్డు
ABHA Health Card

కొండాపూర్‌(హైదరాబాద్): రోగులకు సంజీవని ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ (అభా) కార్డు. దీనిపై ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలు సేకరించి డిజిటల్‌గా నమోదు చేయిస్తోంది. వివరాలను నమోదు చేసిన ప్రతీ రోగికి డిజిటల్‌ నంబర్‌ ఇస్తున్నారు. ఆ నంబర్‌తో రోగుల వ్యక్తిగత డిజిటల్‌ కార్డు తయారవుతుంది. కావాలనుకుంటే కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని తమ వద్ద ఉంచుకోవచ్చు.


ఈ కార్డులో రోగుల ఆరోగ్య విషయాలన్నింటినీ పొందుపరుస్తున్నారు. సదరు రోగికి గతంలో ఉన్న, దీర్ఘకాలిక వ్యాధులు, వాడుతున్న మందులు తదితర వివరాలు పొందుపరుస్తున్నారు. కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది ఓపీ వద్ద కూర్చొని రోగుల వివరాలు సేకరించి ఆయుష్మాన్‌ యాప్‌లో నమోదు చేసి డిజిటల్‌ నంబర్‌ ఇస్తున్నారు.


లాభాలు..

రోగుల గత ఆరోగ్య చరిత్ర డిజిటల్‌ రూపంలో ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌లో నిక్షిప్తం అయి ఉంటుంది. తద్వారా రోగి ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లినా రోగి చరిత్ర డాక్టర్లు తెలుసుకొని అందుకు అనుగుణంగా చికిత్స చేసే అవకాశం ఉంది. చాలామంది పేద రోగులకు ముఖ్యంగా నిరక్షరాస్యులకు ఏ సమయంలో ఏ మందులు వాడాలో తెలియదు. అభా కార్డు ద్వారా వారు గతంలో వాడిన మందులను తెలుసుకునే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అభా కార్డు ద్వారా రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకొని చికిత్స చేయడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది.


city6.2.jpgరోగులకు ఉపయోగం

జిల్లా ఆస్పత్రిలో ప్రతీరోజు అన్ని ఓపీల వద్ద తమ సిబ్బంది రోగుల ఆరోగ్య చరిత్రను తెలుసుకొని డిజిటల్‌గా నమోదు చేస్తున్నారు. వారికి వెంటనే అభా నంబర్‌ ఇస్తున్నారు. ఆ నంబర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రోగులు అభా కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఈ కార్డు రోగులకు ఎంతో ఉపయోగం.

  • డాక్టర్‌ చంద్రకృష్ణ, కొండాపూర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌


వివరాలు చెప్పగానే డిజిటల్‌ నంబర్‌ ఇచ్చారు

నాకు షుగర్‌ వ్యాధి ఉంది. ఓపీకి వచ్చి చూపించుకునే సమయంలో ఆస్పత్రి సిబ్బంది వివరాలు అడిగారు. మొదట చెప్పటానికి సంశయించాను. వారు అభా కార్డు గురించి వివరించగానే వివరాలు చెప్పాను. డిజిటల్‌ నంబర్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌లో అభా కార్డు డౌన్‌లోడ్‌ చేసుకున్నాను.

  • శంకర్‌రావు, ఓపీ పేషెంట్‌


ఈ వార్తలు కూడా చదవండి:

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు సైజులో రేషన్‌ కార్డు

కాజీపేట్‌-బలార్ష మార్గంలో మూడో లైన్‌ రెడీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 11:24 AM