Share News

నేపాల్ సరిహద్దులో చొరబాటుకు యత్నం.. నిషేధిత సంస్థ సభ్యుల అరెస్ట్..

ABN , Publish Date - Jul 24 , 2026 | 10:56 AM

నేపాల్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరిని, వారికి సహకరించిన మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. నిందితులు ఇద్దరూ నిషేధిత వేర్పాటువాద భావజాలంతో ముడిపడిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

నేపాల్ సరిహద్దులో చొరబాటుకు యత్నం.. నిషేధిత సంస్థ సభ్యుల అరెస్ట్..
India Nepal Border Arrest

న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దరిని, వారికి సహకరించిన మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరు నిందితులు నిషేధిత వేర్పాటువాద భావజాలంతో ముడిపడిన ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అలాగే వీరికి సహకరించిన మరో ముగ్గురు భారతీయులనూ అదుపులోకి తీసుకున్నారు.


ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లా రూపైదిహా సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ), ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి వారిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో పంజాబ్‌లోని మోగా జిల్లా మూలాలున్న అమెరికా పౌరుడు మన్వీర్ సింగ్ ధిల్లాన్‌తో పాటు విక్రమ్‌జిత్ సింగ్ ఉన్నారు. 2023లో పంజాబ్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో ఇప్పటికే విక్రమ్‌జిత్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, వీరిద్దరూ నేపాల్ నుంచి రూపైదిహా సరిహద్దు మార్గం ద్వారా భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకుండా సరిహద్దు దాటుతున్నట్లు గుర్తించిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో రూపైదిహా ప్రాంతానికి చెందిన సురేష్ కుమార్ పాఠక్, దిలీప్ ఉపాధ్యాయ్, వాహన డ్రైవర్ రాహుల్ కుమార్‌లను కూడా అరెస్ట్ చేశారు. వీరు ఇద్దరు నిందితుల అక్రమ ప్రవేశానికి సహకరించినట్లు ఆరోపిస్తూ అదుపులోకి తీసుకున్నారు.


విచారణలో విక్రమ్‌జిత్ సింగ్, మన్వీర్ సింగ్ ధిల్లాన్‌లకు ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వీరిపై పంజాబ్‌లో కేసులు నమోదయ్యాయని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. 2021లో దివంగత నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూ ఈ సంస్థను స్థాపించారు. అనంతరం ఈ సంస్థ పంజాబ్‌లోని సామాజిక, మత, రాజకీయ పరిణామాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఓ విదేశీయుడిని ఎస్ఎస్‌బీ అధికారులు అరెస్టు చేశారు. అయితే, తాను అమెరికాలోని కాలిఫోర్నియా వాసినని పోలీసులకు నిందితుడు తెలిపాడు.


ఈ వార్తలు కూడా చదవండి

విరిగిపడుతున్న కొండచరియలు.. ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది

26 రోజుల నిరాహార దీక్షకు విరమణ.. 'ఆకలి రుచే వేరు' అని వ్యాఖ్య

Updated Date - Jul 24 , 2026 | 11:23 AM