Share News

26 రోజుల నిరాహార దీక్షకు విరమణ.. 'ఆకలి రుచే వేరు' అని వ్యాఖ్య

ABN , Publish Date - Jul 24 , 2026 | 10:42 AM

ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

26 రోజుల నిరాహార దీక్షకు విరమణ.. 'ఆకలి రుచే వేరు' అని వ్యాఖ్య
Sonam Wangchuk Ends 26 Day Hunger Strike

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్.. తన 26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు పలికారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, వైద్యులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన సూప్ తాగి దీక్షను విరమించారు. ఆహారం తీసుకున్న అనంతరం వాంగ్‌చుక్ స్పందిస్తూ.. 'సూప్ రుచి బాగుంది.. కానీ ఆకలి రుచి ఇంకా గొప్పది' అని వ్యాఖ్యానించారు.


ఈ దీక్ష విరమణకు ముందు కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ప్రభుత్వం తరఫున పలు హామీలు ప్రకటించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలిపినవారిపై, అలాగే జులై 20న పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్నవారిపై కేసులు నమోదు చేయకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీ సమస్యల పరిష్కారంపై చర్చలు కొనసాగుతాయని, ఇటీవల నీట్ సహా పలు ప్రశ్నపత్రాల లీక్ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు.


నడ్డా ప్రకటన అనంతరం.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు వాంగ్‌చుక్. విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కేనని, అయితే ఉద్యమాలు పూర్తిగా శాంతియుతంగా సాగాలని సూచించారు. ఎలాంటి హింసకు తాను మద్దతివ్వనన్న వాంగ్‌చుక్.. సంఘవిద్రోహ శక్తులు ఉద్యమాలను దుర్వినియోగం చేసేందుకు అవకాశమివ్వకూడదనీ కోరారు. ఈ సందర్భంగా తన భార్య గీతాంజలి ఆంగ్మోకూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారాయన. ఆమె ఎల్లప్పుడూ తనకు అండగా నిలిచారని, వాటికి ధన్యవాదాలు మాత్రమే సరిపోవన్నారు.


ఇదిలా ఉండగా.. వాంగ్‌చుక్ దీక్షను విరమించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని, బరువును తిరిగి సాధించుకోవాలని సూచించారు.


ఇవీ చదవండి:

ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గని సీజేపీ.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

కన్నీరు పెట్టిస్తున్న విషాదం.. క్షణాల్లో కుటుంబాన్ని కబళించిన కొండచరియ..

Updated Date - Jul 24 , 2026 | 11:00 AM