Share News

కాంగ్రెస్‌దే పేపర్‌ లీకుల చరిత్ర!

ABN , Publish Date - Jul 24 , 2026 | 06:10 AM

దేశ వ్యతిరేక శక్తులు ఏకమై నిరసనల పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. భారత్‌ను ముక్కలు చేయాలని, నిర్వీర్యం చేయాలని...

కాంగ్రెస్‌దే పేపర్‌ లీకుల చరిత్ర!

విద్యార్థులపై ఆ పార్టీకి ప్రేమ లేదు.. వారిని ఎగదోసి దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ప్రయత్నాలు

  • నిరుడు తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీక్‌ కాలేదా?

  • అప్పుడు రేవంత్‌ విద్యాశాఖను వదులుకున్నారా?

  • బీఆర్‌ఎస్‌ హయాంలో ఇంటర్‌ పిల్లలు ఆత్మహత్య చేసుకోలేదా?

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

న్యూఢిల్లీ, జూలై 23(ఆంధ్రజ్యోతి): దేశ వ్యతిరేక శక్తులు ఏకమై నిరసనల పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. భారత్‌ను ముక్కలు చేయాలని, నిర్వీర్యం చేయాలని ఆలోచనతో ఉన్న అసాంఘిక శక్తులు, తుక్డే గ్యాంగులు జంతర్‌ మంతర్‌ వద్దకు చేరి ధర్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ విద్యార్థులు, యువతను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు అరాచకాలకు ప్పాలడుతున్నాయని ఆరోపించారు. విపక్షాలకు విద్యార్థుల భవిష్యత్తు, దేశభద్రత అవసరం లేదని, అధికారం రాకపోతే ఏ వ్యవస్థనైనా కూల్చేస్తామన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదని, ఆ పార్టీది పేపర్‌ లీకుల చరిత్ర అని, దేశంలోని అన్ని వ్యవస్థలను కూల్చే ప్రయత్నం చేస్తోందని, విద్యార్థులను ఎగదోసి దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. సంఘ విద్రోహశక్తులు ధర్నాలో చేరి పోలీసులపై దాడులు చేస్తున్నాయనీ ఆరోపించారు. గురువారం తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో కాంగ్రెస్‌ పాలనలో పేపర్‌ లీకులు జరిగితే రాజీనామా చేయని ఆ పార్టీ నేతలు ఇవాళ.. బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలని అడుగుతున్నారని.. రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డికి తమను రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. రాహుల్‌ వల్ల విద్యార్థులకు నష్టం తప్పితే ఒరిగేదేమీ ఉండదని విమర్శించారు. నిరుడు పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ అయినప్పుడు సీఎం రేవంత్‌ తన వద్దే ఉన్న విద్యాశాఖను ఎందుకు వదులుకోలేదని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాకే నీట్‌ పేపర్‌ లీక్‌పై తమను ప్రశ్నించాలని సూచించారు. ఈ ఏడాది జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ, జగిత్యాలలో బీఎస్సీ పేపర్‌ లీక్‌ అయిందని, అప్పుడుమంత్రులతో రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎక్కడికి పోయారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్లు ఎన్నిసార్లు లీక్‌ అయ్యాయి? వాటిపై కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘కోదండరాం ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? మీకు ఎమ్మెల్సీ ఉద్యోగం రాగానే అందరికీ ఉద్యోగం వచ్చినట్టేనా? జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వకపోతే మీరు కనీసం ప్రశ్నించారా? కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయలేదు.


వాటి గురించి ప్రశ్నించకుండా.. ఇప్పుడు మాకు నీతులు చెబుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ కేంద్రంగా గత రెండు రోజులుగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలు రాజకీయ ప్రేరేపితంతో జరుగుతన్నాయని విద్యార్థులను అడ్డుగా పెట్టుకుని, దేశ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయినప్పుడు వెంటనే కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుని, 17 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టిందని చెప్పారు. మిలటరీ విమానాల ద్వారా ప్రశ్నాపత్రాలను తరలించి.. రెండోసారి సమర్థవంతంగా నీట్‌ పరీక్ష నిర్వహించామని చెప్పారు. రెండోసారి పరీక్ష రాసిన విద్యార్థులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఎన్ని రకాల ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయో తెలుసుకోవాలని, అప్పుడు ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడులో, కేరళ, ఢిల్లీలో షీలా దీక్షిత్‌ హయాంలో, రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ హయాంలో 18 పేపర్లు లీక్‌ అయ్యాయని.. అప్పుడు ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, పంజాబ్‌లో కూడా పేపర్లు లీక్‌ అయ్యాయని మరి అక్కడికి వెళ్లి ఆయన ఎందుకు ధర్నాలు చేయలేదు? అని ప్రశ్నించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 06:40 AM